పకడ్బందీగా శాసనమండలి ఓటర్ల జాబితా
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఓటర్ల జాబితా పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇది వరకు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఈ 19వ తేదీ సాయంత్రంలోగా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఎల్‌సీ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యేందుకు వచ్చిన ధరఖాస్తులను 100 శాతం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ నెల 19 నాటికి వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈ నెల 14 వరకు వచ్చిన పారం–6, 7, 8, 8ఎ దరఖాస్తులపై విచారణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లో అర్హులయిన వారంతా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం చేపడతామన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులతో పాటు అన్ని క్లెయిమ్‌లను పకడ్బందీగా పరిశీలిస్తామన్నారు. ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో చదివిన వారికి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ లేదా రిజిస్ట్రార్ కౌంటర్ సంతకం ఉన్న సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకుంటామని, ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి జేఎన్‌టీయూ సంతకం ఉంటేనే ఆమోదిస్తామన్నారు.ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లను నమోదు చేస్తామని వివరించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పట్టభద్రులు 74,499 మంది, ఉపాధ్యాయులు 6189 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.