బీడీకార్మిక ఆస్పత్రికి సుస్తి | beedi karmika hospital in fever | Sakshi
Sakshi News home page

బీడీకార్మిక ఆస్పత్రికి సుస్తి

Published Tue, Aug 9 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

జగిత్యాలలోని బీడీ కార్మిక సంక్షేమనిధి స్థానిక, సంచార దవాఖాన

జగిత్యాలలోని బీడీ కార్మిక సంక్షేమనిధి స్థానిక, సంచార దవాఖాన

  • వైద్యుడు లేడు.. మందులూ లేవు
  • అద్దె కూడా చెల్లించని వైనం
  • ఈఎస్‌ఐకి తరలించే యోచన?
  • ఆస్పత్రి తరలిపోతే కార్మికులకు ఇబ్బందే..
  • బీడీ కార్మికుల దవాఖాన దుస్థితి
  • జగిత్యాల అర్బన్‌ : జగిత్యాలలోని బీడీ కార్మికుల ఆసుపత్రికి సుస్తి చేసింది. 1997లో 37 వేల మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు లేరు. కనీసం మందులు కూడా లేవు. సకాలంలో వైద్యమందక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల డివిజన్‌లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉండడంతో కేంద్రప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా బీడీ కార్మిక సంక్షేమ నిధి, స్థానిక సంచార దవాఖానా ఏర్పాటు చేసింది. అద్దె భవనంలో ప్రారంభించిన అధికారులు.. ఎనిమిది నెలలుగా యజమానికి అద్దె చెల్లించడంలేదు. గత్యంతరం లేక యజమాని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.
    లేని వైద్యులు.. అందని మందులు
    ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఒక ఫార్మాసిస్ట్, ఒక నర్స్, మల్టీ టాస్క్‌స్టాఫ్‌ ఇద్దరు పనిచేస్తున్నారు. వీరితోనే ఆసుపత్రిని వెళ్లదీస్తున్నారు. మరోవైపు మందులు లేకపోవడంతో కార్మికులు చికిత్సకు దూరమవుతున్నారు. కనీసం పెయిన్‌కిల్లర్స్, బీపీ, షుగర్, జలుబు, యాంటిబయాటిక్స్, విరోచనాల నివారణతోపాటు మహిళలకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవంటే అతిశయోక్తికాదు. మందుల కోసం ప్రతిరోజూ కార్మికులు ఆసుపత్రికి వచ్చి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. విషయాన్ని హైదరాబాద్‌లోని డెప్యుటీ వెల్ఫేర్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామని సిబ్బంది చెబుతున్నారు. 
    వరంగల్‌ తరలింపు?
    ఇక్కడి ఆసుపత్రికి జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాల బీడీ కార్మికులతోపాటు పొరుగు జిల్లాల కార్మికులు వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో వైద్యుడిని నియమించడంతోపాటు మందులు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు.. అద్దె భవనంలో నిర్వహిస్తున్నా.. కిరాయి మాత్రం చెల్లించడం లేదు. పైగా వేరే భవనం చూడాలని, లేకుంటే వరంగల్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్పత్రిని వరంగల్‌లోని ఈఎస్‌ఐ (ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌) ఆస్పత్రికి తరలిస్తే ఇక్కడి వేలాది మంది కార్మికులకు వైద్యం అందకుండాపోయే ప్రమాదముంది. 
    కార్మికుల దరి చేరని పథకాలు
    ఈ ఆసుపత్రిలో బీడీ కార్మికులతోపాటు కార్డు పొందినవారూ వైద్య సేవలు పొందుతారు. కార్డు పొందిన కార్మికురాలి కొడుకులు, కూతుళ్లకు సైతం వైద్యం అందించాల్సి ఉంది. విద్యా పథకం కింద ఉపకార వేతనాలు అందించాల్సి ఉంది. వినోదం పథకంలో భాగంగా ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందించాల్సి ఉన్నా.. సరిపడా సిబ్బంది లేకపోవడంతో కేంద్రప్రభుత్వ పథకాలు కార్మికులకు అందకుండాపోతున్నాయి.
    వైద్య శిబిరాలు దూరం
    ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతివారం రెండుసార్లు బీడీకార్మికులు అధికంగా ఉన్న గ్రామాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. వైద్యుడు లేకపోవడం.. మందులు రాకపోవడంతో క్యాంపులు నిర్వహించడం లేదు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ తీసుకుని బీడీ కార్మికుల ఆసుపత్రికి సొంత భవనం నిర్మించడంతోపాటు వైద్యుడిని నియమించాలని, మందులు తెప్పించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement