మల్లన్న హుండీలో సాంబ్రాణి రవ్వలు
- రూ.1,060 దగ్ధం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో సోమవారం పొరపాటున సాంబ్రాణి నిప్పు రవ్వలు పడడంతో హుండీలోని రూ.1060 దగ్ధమైనట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. శ్రీస్వామివార్ల ఆలయంలోని హుండీని మంగళవారం దేవాదాయశాఖ అధికారి సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ.6,42,373 వచ్చిందని.. ఇందులో నిప్పు రవ్వల వల్ల రూ.1,060 వినియోగానికి అవకాశం లేకుండా పోయినట్లు వెల్లడించారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, మహామంగళహారతి సేవలు, సాయంత్రం జరిగే మహామంగళహారతి సేవలలో స్వామివార్లకు ప్రత్యేకంగా సాంబ్రాణితో ధూపం వేస్తారు. సోమవారం స్వామివార్ల హారతుల సమయంలో ధూపంవేసి గర్భాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న హుండీలో నిప్పురవ్వ హుండీలో పడినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది కూడా ఇది గమనించకపోవడం.. కొద్దిసేపటికి హుండీల్లో పొగరావడంతో వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.