
నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపింది వైఎస్సే..
‘‘పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రావడంతో కొందరు రైతులు వాటిని వేసి పంట నష్టపోయారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి
ఖమ్మం: ‘‘పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రావడంతో కొందరు రైతులు వాటిని వేసి పంట నష్టపోయారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వైఎస్ ఆ కంపెనీ యజమానులను పిలిపించి నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎంతమేరకు నష్టపోయారో అంత పరిహారం వారిచేతనే ఇప్పించారు. మళ్లీ రాష్ట్రంలో అడుగుపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అప్పట్నుంచి అలాంటి విత్తనాలు రానే లేదు.. అది పాలనపై పట్టు ఉన్నవారికే సాధ్యమవుతుంది’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
నకిలీ విత్తనాలు, వర్షాలతో నష్టపోరుున రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తన కంపెనీలతో ప్రభుత్వానికి, మంత్రులకు సంబంధాలు ఉండబట్టే వాటిపై చర్యలు తీసుకోలేదన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోరుున మిర్చి రైతులకు ఎకరాకు రూ.లక్ష, వర్షాల వల్ల పత్తి పంట నష్టపోరుున రైతులకు ఎకరాకు రూ.40 వేలు చెల్లించాలని భట్టి డిమాండ్ చేశారు. రైతులకోసం అన్ని పార్టీలతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.