పే..ద్దక్యూ
కల్లూరు(రూరల్): కరెన్సీ కష్టాలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం..బ్యాంకులు పనిచేయకపోవడం..ఏటీఎంలు మూసి ఉండడంతో నగదు దొరకడం గగనమైంది. అత్యవసరాలను తీర్చుకోలేక శనివారం..జిల్లాలో పలువురు ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ పనిచేస్తున్న ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పెట్టిన డబ్బు కొన్ని గంటల్లోనే ఖాళీ కావడం..నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండడంతో ప్రజల వేదన వర్ణనాతీతం. బ్యాంక్ ఖాతాలకు పింఛన్ డబ్బు జమ చేయడంతో వృద్ధుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. డబ్బు లేకపోతే ఎలా బతకాలి నాయనా అంటూ కొందరు కన్నీరు పెడుతున్నారు.
ఆరు గంటలు క్యూలో..
కర్నూలు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎంకు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినా. దాదాపు నాలుగు గంటలు క్యూలో నిల్చున్నా. ఇంకా నా ముందు 50 మంది ఉన్నారు. డబ్బు అవసరం ఉండటంతో రాత్రి 8 గంటల వరకు క్యూలోనే ఉండిపోయా. ఏటీఎం నుంచి కేవలం రూ.2,500 వస్తాయి. ఈ డబ్బు కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. ప్రతి రోజు రూ.5వేలు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్యూలో నిలబడి కాళ్లనొప్పులు తెచ్చుకుని మరీ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని ఎస్‌బీఐ ఏటీఎంలతో పాటు అన్ని బ్యాంకుల ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచితే సమస్య పరిష్కారం అవుతుంది.
– జి.సోమశేఖర్, దేవనగర్, కర్నూలు