‘అయ్యో’మెట్రిక్
– సర్వజనాస్పత్రిలో హాజరు తంటాలు
– సరిగా పనిచేయని బయోమెట్రిక్ మిషన్లు
– అవస్థలు పడుతున్న ఉద్యోగులు
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘హాజరు’ తంటాలు వెంటాడుతున్నాయి. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లినప్పుడు.. ముగించుకున్నప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేయాల్సి ఉండడం...మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బయోమెట్రిక్ మిషన్లన్నీ ఒకే గదిలో ఉంచడంతో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ ప్రాంతం కిక్కిరిస్తోంది. సకాలంలో వేలిముద్రలు పడకపోవడంతో కొందరు ప్రత్యేక రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్తుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయేమోనని మరికొందరు నిరీక్షిస్తున్నారు.
500 మందికి మూడు మిషన్లు!
సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు, పారామెడికల్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది సుమారు 500 మందికి పైగా ఉంటారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ బయోమెట్రిక్ హాజరును అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ల్యాబ్‌టెక్నీషియన్లకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పని సరిచేశారు. ఇన్నాళ్లూ ఓపీ పైన హాజరు వేసే ప్రక్రియ జరిగేది. పై అంతస్తులోకి వెళ్లడానికి ఇబ్బందులు వస్తుండడంతో ఓపీ పక్కనున్న ఆరోగ్య శ్రీ గదిలోకి మార్చారు. రోజూ ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 8 గంటలకు తప్పనిసరిగా హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ ఒకేసారి వస్తుండడంతో ఉన్న మిషన్లు సరిపోవడం లేదు. ఉద్యోగులు మొదటగా తమ ఆధార్‌నంబర్ నమోదు చేసి.. వేలి ముద్ర వేయాలి.
అయితే చాలా మంది వేలి ముద్రలు సరిగా తీసుకోవడం లేదు. దీంతో వారు మళ్లీ ప్రయత్నిస్తుండడంతో సమయం వృథా అవుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులు ‘హాజరు’ ఆలస్యం అవుతుందని, తీరా జీతం విషయంలో కోత పడుతుందేమోనని భయపడుతున్నారు. ప్రస్తుతం మూడు బయోమెట్రిక్ మిషన్లను అమర్చగా మంగళవారం రెండు మాత్రమే పని చేశాయి. మధ్యాహ్నం సమయంలో ఉద్యోగులు ఒక్కసారిగా అక్కడికి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు యంత్రాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తడంతో నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా ‘హాజరు’ పడకపోవడంతో చివరకు రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు స్పందించి మరో రెండు యంత్రాలను అందుబాటులోకి తెస్తే సమస్య తీరే అవకాశం ఉందని ఉద్యోగులు చెప్పారు.