
వాట్సప్‌లో వీడియో కోసం ఈతకు దిగి...
- వీడియో దిగుతూ చెరువులో మునిగిపోయిన యువకుడు !
- మిత్రుడి కళ్లెదుటే నీటిలో మునిగి మృత్యువాత
పులిగుచ్చతండాకు చెందిన శ్రీనివాస్ (24) ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తన మిత్రుడు గోపాల్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఎక్క చెరువుకు వెళ్లాడు. తాను హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొందాల్సి ఉంటుందని, మళ్లీ ఎన్ని రోజులకు స్వగ్రామానికి వస్తానోనని ఆలోచించి మిత్రునికి ఫోన్ అందించి తాను ఈదుతున్న వీడియోను వాట్సప్‌లో అప్‌లోడ్ చేయాలన్నాడు. శ్రీనివాస్ చెరువులో దూకి ఈదడానికి ప్రయత్నించాడు. కానీ అతను కిందికి దిగిపోయాడు. కళ్లముందే మిత్రుడు నీటిలో మునుగుతుండగా, గోపాల్ ఏమీ చేయలేకపోయాడు. ఫోన్‌లో బ్యాలెన్స్ కూడా లేకపోవడంతో అతను కేకలు వేసినా... ఎవరూ సహాయానికి రాలేకపోయారు. ఘటనను ఆలస్యంగా తెలుసుకొని వచ్చిన బంధుమిత్రులు మంగళవారం శవం కోసం వెతకగా లభ్యమైంది. మృతుడు తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. తండ్రి బాబు విలపించడం అక్కడివారిని కలిచివేసింది.