నారాయణఖేడ్: అంబేద్కర్ వర్ధంతిని నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్వార్ గ్రామంలో దళితులతో కలిసి బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. రాజీవ్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని సూచించారు. అవినీతి రహిత సమాజం బీజేపీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నకిలీనోట్లు, నల్లధనం నివారణ కోసం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సహాయం అందకుండా పోయిందన్నారు. ఇందుకు ప్రజల ఆమోదం ఉందన్నారు. తాత్కాలింకగా ఇబ్బందులున్నా శాశ్వతంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకటేశం, నాయకులు అమర్‌సింగ్, కృష్ణ, సంగమేశ్వర్, సిద్దయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.