మంత్రాలు సరిగ్గా చదవడం లేదని, పెళ్ళి ఆలస్యంగా చేస్తున్నాడని పురోహితుడిపై వరుడి బంధువులు దాడి చేశారు.
పాలకుర్తి: మంత్రాలు సరిగ్గా చదవడం లేదని, పెళ్ళి ఆలస్యంగా చేస్తున్నాడని పురోహితుడిపై వరుడి బంధువులు దాడి చేశారు. సంఘటన శనివారం కరీంనగర్ జిల్లాలోని బసంత్‌నగర్‌లో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్‌నగర్‌కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకు స్థానిక కోదండ రామాలయం పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు. అయితే పెళ్ళి ముహూర్త సమయానికి కంటే ఆలస్యంగా జరిగింది. ఈనేపథ్యంలో చిత్తుగా మద్యం సేవించిన వధువు తరఫు బంధువు ఒకరు.. మంత్రాలు సరిగ్గా చదవడం లేదంటూ గొడవకు దిగి పెళ్లకి ఆటంకం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఇరువైపులా బంధువులు సర్థిచెప్పి వివాహతంతు ముగించారు. వివాహం ముగిసిన అనంతరం చొప్పదండి మండల కేంద్రానికి చెందిన వధువు తరుపు బంధువు సమీపంలోని కర్రతో పూజారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో పూజారి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్రం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. విషయం తెలిసిన బసంత్‌నగర్ పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు.