ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉజ్వల భవిష్యత్తు
సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త రాఘవరావు ఉద్ఘాటన
విజ్ఞాన్‌లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
చేబ్రోలు: ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ మేకింగ్‌లకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని బెంగళూరుకు చెందిన సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి) ఫుడ్ ఇంజినీరింగ్ విభాగ శాస్త్రవేత్త, ఆచార్యుడు డాక్టర్ కేఎంఎస్ రాఘవరావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫుడ్ ఫెస్టినో పేరుతో రెండు రోజుల నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. 11 రాష్ట్రాల నుంచి 250 మందికిపైగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విభాగ శాస్త్రవేత్త రాఘవరావు మాట్లాడుతూ సంప్రదాయ వంటల విలువను యువత ప్రపంచానికి చాటాలన్నారు. జొన్న అన్నం, రాగి సంగటి, సజ్జలతో అన్నం తింటే అనారోగ్యం దరిచేరదని చెప్పారు. ఆహార ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. సీఎస్‌ఐఆర్ ప్లాటినం జూబ్లి మెంటార్ ప్రసాద్ ఆహార నిల్వ, నాణ్యతపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వీసీ సి.తంగరాజ్, రెక్టార్ బి.రామ్మూర్తి, డీఈఎం వి.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాల్లో పోటీలు..
పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, వంటల తయారీ, ఫుడ్ కార్వింగ్, ట్విస్ట్ ఇన్ టేస్ట్, ఫూఫై జోడీ, ఫామ్, ఫుడ్ స్పార్క్స్, ట్రెజర్ హంట్... ఇలా పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి వారి వంటకాలను యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందికి రుచి చూపించారు.