- తమ్ముడి అంత్యక్రియల కోసం వచ్చిన అన్న గుండెపోటుతో మరణం
- ఇద్దరూ దుబాయ్‌లోనే జీవనం
- తల్లడిల్లుతున్న కుటుంబీలు
తమ్ముడి వెంట.. అన్న..
Published Mon, Jan 16 2017 9:48 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
అన్నదమ్ములు.. జీవన పోరాటంలో వారిద్దరూ కలిసి కష్టపడ్డారు.. రోజుల వ్యవధిలో ఇద్దరూ కలిసి అనంత లోకాలకు వెళ్లిపోయారు. జీవనోపాధి కోసం దుబాయ్‌కి కలిసి వెళ్లిన వారిద్దరూ వారి కుటుంబాలను పోషించుకుని, వృద్ధురాలై తల్లికి బాసటగా నిలిచారు. అక్కడ మృతి చెందిన తమ్ముడి మృతదేహం ఇక్కడికి వచ్చేలోగా.. అతడి అంత్యక్రియల కోసం వచ్చిన అన్న.. గుండెపోటుతో మృతి చెందాడు. కలిసికట్టుగా వచ్చిన ఈ కష్టాన్ని భరించలేక ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
శంకరగుప్తం (మలికిపురం) (రాజోలు నియోజకవర్గం) :
గ్రామంలోని చెవ్వాకుల వారి గ్రూపునకు చెందిన అన్నదమ్ములు చెవ్వాకుల సువర్ణరాజు, గాబ్రియేల్ ఉపాధి కోసం దుబాయ్‌లో ఉంటున్నారు. సువర్ణరాజు (39) గుండెపోటుతో గత ఏడాది డిశెంబర్ 21న దుబాయ్‌లో మృతి చెందాడు. దుబాయ్‌లోనే ఉంటున్న అన్న గాబ్రియేల్ తమ్ముడు అంత్య క్రియల కోసం స్వగ్రామం చేరుకున్నాడు. దుబాయ్ నుంచి రావాల్సిన తమ్ముడు సువర్ణరాజు మృతదేహం కోసం ఎదురు చూస్తూ.. గాబ్రియేల్‌కు గుండెపోటుతో ఈ నెల 11న మృతి చెందాడు. ఈ నెల 13న సువర్ణరాజు మృతదేహం దుబాయ్ నుంచి స్వస్థలం చేరింది. సువర్ణరాజు మృతదేహం చేరడానికి రెండు రోజుల ముందే అన్న గాబ్రియేల్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సువర్ణరాజు మృతదేహానికి ఆదివారం అంత్యక్రయలు చేశారు.
కన్నీరు మున్నీరైన కుటుంబం...
చెవ్వాకుల సీతారామయ్యకు ఐదుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. సీతారామయ్య గతంలోనే మృతి చెందారు. సీతారామయ్య భార్య సౌదామణి అనారోగ్యంతో మంచాన పడింది. కుమారుల్లో వీరిద్దరూ పెద్దవారు. చనిపోయిన పెద కుమారుడు గాబ్రియేల్‌కు ముగ్గురు కుమార్తెలు. విదేశాల్లో ఉపాధి పొందుతూ ఇద్దరి కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. మూడో కుమార్తెకు వివాహం చేయాల్సిఉంది. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆమె రోదిస్తోంది. మృతి చెందిన రెండో కుమారుడు సువర్ణరాజుకు ఇద్దరు కుమారులు. వారు 8. 6 తరగతులు చదువుతున్నారు. సువర్ణరాజు భార్య ఉపాధి కోసం గతంలో కువైట్ వెళ్లి ఇబ్బందులు పడి వచ్చేసింది. తిరిగి ఇటీవలే అక్కడికి వెళ్లింది. భర్త ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె డిసెంబర్ 24న ఇంటికి వచ్చేసింది. తన దుస్థితిని తలచుకుని బోరున విలపిస్తోంది. మూడో కుమారుడు ఉపాధి కోసం వెళ్లి అదృశ్యం అయ్యాడు. కుటుంబం వచ్చిన దీనస్థితిని తలచుకుని మంచాన ఉన్న తల్లి కుమిలిపోతోంది.
Advertisement
Advertisement