తమ్ముళ్ల తన్నులాట
తమ్ముళ్ల తన్నులాట
Published Thu, Aug 25 2016 1:15 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
– ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గొడవ
–రామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వర్గీయుల బాహాబాహీ
–ఎన్నికలు వాయిదా
మంత్రాలయం రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్‌ఐ సునీల్‌కుమార్ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు.
Advertisement