సినీఫక్కీలో గంజాయి పట్టివేత
దేవరపల్లి: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.25 లక్షల విలువ గల 524 కిలోల గంజాయిని దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు రూ.4.17 లక్షల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై ఆంజనేయులు, సిబ్బందిపై సదరు వ్యక్తులు కర్రతో దాడికి యత్నించగా ఎస్సై గాలికిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం రాత్రి పోలీస్‌స్టేçÙన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు వివరించారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఐషర్ వ్యాన్ సీక్రెట్ బాక్సులో 500 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో దేవరపల్లి వద్ద గస్తీకాసి పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ వెనుక గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయగా కారులోని వ్యక్తులు ఎస్సై ఆంజనేయులు, సిబ్బం దిపై కర్రతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎస్సై ఆంజనేయులు గాలిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా 24 కిలోల గంజాయి, రూ. 4.17 లక్షల నగదు ఉన్నాయి. నిందితుల నుంచి గంజాయి, నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
ఇద్దరు పాత నేరస్తులు
వరంగల్ జిల్లా ఓబులాపురానికి చెందిన బో నోతు యాకోబ్, విశాఖ జిల్లా జానకీరామ్‌పురానికి చెందిన అమ్మిరెడ్డి రమణ, ఓబులాపురానికి చెందిన బోనోతు సునీల్, రంగారెడ్డి జిల్లా చర్లపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ కర్రి శ్రీశైలం, గుంటూరు జిల్లా హున్నాబాద్‌కు చెందిన తేజోవత్ సుకేందర్, కెతోవత్ శంఖర్‌ను అరెస్ట్ చేసినట్టు సీఐ సుబ్బారావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిందితుడు అమ్మిరెడ్డి రమణపై విశాఖ జిల్లా కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో గతంలో నాలుగు గంజాయి కేసులు, ఆయుధాల సరఫరా కేసు నమోదయ్యాయన్నారు. రెండు ఫిస్టల్స్‌ను కూడా అక్కడ పోలీసులు రమణ నుంచి స్వాధీనం చేసుకుని రౌడీషీట్ ఓపెన్ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా రమణ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. బోనాల యాకోబ్‌పై కూడా రెండు గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది నాగేశ్వరరావు, బాలా జీ, గంగరాజు, శ్రీనును సీఐ అభినందించారు.