అంచనాల్లో అభ్యర్థులు
Published Wed, Mar 8 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
– సంఘాలపైనే అభ్యర్థుల గెలుపు
– విస్త్రత ప్రచారం చేసిన కేవీ సుబ్బారెడ్డి
– పోటా పోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు
కర్నూలు సిటీ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సర్వసిద్ధం అయ్యింది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 9వ తేదిన ఎన్నికలకు ఉపాధ్యాయులు సిద్ధం అవుతున్నారు. కర్నూలు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు 25515 మంది ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 10 మంది పోటీలో ఉన్నారు.
జిల్లాలో 7430 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి ప్రచారంలో దూసుకుపోయారు. మిగతా వారు సైతం వారి వారికి తగ్గట్లు ప్రచారం చేశారు. తెలుగు దేశం పార్టీ తమ అభ్యర్థిగా బచ్చల పుల్లయ్యను ప్రకటించింది. అయితే ఆయన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అనంతపురం జిల్లాలో ఓ లాడ్జిలో డబ్బులు పంచడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా గతంలో బచ్చల పుల్లయ్యకు మద్దతు ఇచ్చిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన వారు.. ఈ ఏడాడి కేవీ సుబ్బారెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈయనకు మూడు జిల్లాలో వైఎస్‌ఆర్‌టీఎఫ్ మద్దతు ఇస్తోంది.
మరో అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి నాన్‌లోకల్ సమస్య అడ్డుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. నాన్‌లోకల్ కింద చిత్తూరు జిల్లాలో కత్తి నరసింహా రెడ్డి పని చేస్తున్నారని, పుట్టింది మాత్రం కడప జిల్లా సుండ్రుపల్లి మండలం జికె రాజపల్లి గ్రామం అని ఆయనకు మద్దతు ఇచ్చేవారు చెబుతున్నారు. ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ నామమత్రంగానే మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్రిముఖ పోటీ...!
సాధారణ ఎన్నికలను సైతం తలపించేలా పశ్చిమ రాయల సీమ ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు వారిని బలపరిచిన వారి నుంచి సేకరించికున్న సమాచరంతో గెలుపుపై అంచనాలు వేసుకునే పనిలో ఉన్నారు. పది మంది అభ్యర్థులు పోటీలు ఉన్నా కూడా ప్రధానంగా ముగ్గురు మధ్యే పోటీ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థుల గెలుపు మాత్రం సంఘాలపైనే ఆధారపడి ఉండడం గమనర్హం.
Advertisement
Advertisement