దసరా తర్వాత కెరీర్ ఫౌండేషన్ కోర్సులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం లాంటి కెరియర్ ఫౌండేషన్ కోర్సులను దసరా సెలవుల అనంతరం ప్రారంభిస్తున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. స్థానిక దర్గామిట్ట జెడ్పీ సమావేశమందిరంలో శనివారం ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియం, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న 150 ప్రభుత్వ పాఠశాలల్లో కోర్సులను నిర్వహించేందుకు రూపొందించిన ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేయాలన్నారు. 6,7,8 తరగతులకు కెరియర్ ఫౌండేషన్ కోర్సుల్లో భాగంగా ప్రతిరోజు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, బయోలజీతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. వారాంతంలో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. సమాధాన పత్రాల ఓఎంఆర్‌లను కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేసి విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 27, 28, 29తేదీల్లో నెల్లూరు,కావలి,గూడూరు డివిజన్లలో ఎంపికచేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎయిడెడ్ స్కూళ్లలో సర్దుబాటు:
ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు విషయమై మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లుతో, హెచ్‌ఎంలతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్‌కోర్సు నిర్వహణపై డాక్టర్ వెంకటేశ్వరరావు, కృపానందంలు అవగాహన కల్పించారు.