
డీజీపీతో సమానంగా వేతనం ఇప్పించండి
క్యాట్‌ను ఆశ్రయించిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తాను పదవీ విరమణ చేసిన 2016 డిసెంబర్ 31 వరకు డీజీపీ అనురాగ్‌శర్మతో సమానంగా వేతనం మంజూరు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను క్యాట్ సభ్యుడు జేకే శ్రీవాస్తవ గురువారం విచారించారు. ఐపీఎస్ క్యాడర్‌లో అనురాగ్‌శర్మ తనకంటే ఏడాది జూనియర్ అని, ఆయనతో సమానంగా తనకు వేతనం ఇవ్వాలంటూ 2016 నవంబర్‌లో తాను కేంద్రానికి రాసిన లేఖను తిరస్కరించడం చట్టవిరుద్ధమన్నారు.
ఇదే అభ్యర్థనతో గత ఏడాది ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి పదవీ విరమణ వరకూ డీజీపీతో సమానంగా రూ.80వేల వేతన శ్రేణి ప్రకారం వేతనం, పదవీ విరమణ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ పదవికి తనకు అన్ని అర్హతలున్నా, అనేక కారణాలతో అనురాగ్‌శర్మను డీజీపీగా నియమించారని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ శ్రీవాస్తవ నోటీసులు జారీచేశారు.