
సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్ట్
అనంతపురం న్యూసిటీ: రైళ్లలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లే దొంగను రైల్వే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి రూ.10,22,693 విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం రైల్వే పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తబ్రేజ్ వెల్లడించారు. పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన ఓబన్నగారి వినోద్ పుట్టిన మూడు నెలకే తన తండ్రి వెంకట్రాముడు ఫ్యాక‌్షన్ గొడవల్లో మృతి చెందాడు. ఈ ఘటనతో వినోద్ తల్లి మతిస్థిమితం కోల్పోయింది. పేదరికం తోడవడంతో వినోద్ క్రమంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు.
2013లో అనంతపురం రైల్వే స్టేషన్ దొంగతనం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. ఏడాది తర్వాత కేసు కొట్టేశారు. పొట్టకూటి కోసం కొయంబత్తూరుకు వెళ్లాడు. పని చేతకాక తిరిగి 2016 నుంచి దొంగతనాలు మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలులో జర్మనీకి చెందిన ఫ్లాయిడ్ ఫిషర్ అనే వ్యక్తికి చెందిన మాక్ బుక్ ల్యాప్‌టాప్, బీక్యూ మొబైల్, నికాన్ అబ్జెక్టివ్ లెన్స్ కెమెరా, రెండు ఎస్‌డీ కార్డ్స్, హార్డ్ డ్రైవ్, ట్రావెల్ అడాప్టర్ దొంగిలించాడు. వీటి విలువ రూ 4,12,300. అలాగే వివిధ రైళ్లలో దాదాపుగా 35 సెల్ ఫోన్లు దొంగిలించాడు. రైలు స్లో అవుతున్న సమయంలో సెల్‌ఫోన్లు అపహరించి పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దొంగపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం రైల్వేస్టేషన్‌లో పోలీసులను చూసి పరుగులు తీస్తున్న ఓబన్నగారి వినోద్‌ను పట్టుకుని, విచారించగా నేరాలు ఒప్పుకున్నాడని సీఐ తబ్రేజ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో గుంతకల్లు ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.