
చంద్రన్న బీమాతో తాపీ కార్మికులకు నష్టం
విజయవాడ (గాంధీనగర్): భవన నిర్మాణ కార్మికులను వెల్ఫేర్ బోర్డు పరిధిలోనే కొనసాగించాలని ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికి వెల్ఫేర్ బోర్డునుంచే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం కార్మికులనందరినీ చంద్రన్న బీమా పథకానికి మార్చాలని నిర్ణయించి, వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంక్షేమ బోర్డు నిధులను చంద్రబాబు తన సొంత ప్రచారం కోసం, మంత్రులు, అధికారుల విలాసాల కోసం వినియోగిస్తున్నారన్నారు.
బోర్డు నిధులతో చంద్రన్నబీమా ప్రచారం
ఇప్పటికే చంద్రన్నబీమా పేరుతో సొంత ప్రచారానికి రూ. 200 కోట్లు బోర్డు నిధులను తరలించిందని రావు ఆరోపించారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు సహజ మరణానికి రూ. 60 వేలు, దహన సంస్కారాలకు రూ. 20వేలు చెల్లిస్తున్నారన్నారు. కానీ చంద్రన్నబీమా పథకం ద్వారా కేవలం రూ. 30వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇప్పటికే సంక్షేమ బోర్డులో రూ. 1300 కోట్లు సెస్‌ల ద్వారా సేకరించిన నిధులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఒక్కరూపాయి కూడా చెల్లించలేదన్నారు. కార్మికుల కడుపుకొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్మికులను వెల్పేర్ బోర్డులోనే కొనసాగిస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని, అవసరమైతే మిలిటెంట్ పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పిల్ల నర్సింహారావు పాల్గొన్నారు.