బీసీలను మోసం చేస్తున్న చంద్రబాబు
Published Sat, Aug 6 2016 12:21 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు జి.గంగాధర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు డిక్లరేషన్‌పై హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి రెండేళ్లయినా డిక్లరేషన్‌పై పెదవివిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చట్ట సభల్లో బీసీలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేడతామని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడంపై దృష్టి సారిస్తామని ప్రకటించారని తెలిపారు. వాటితో పాటు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారని తెలిపారు. డిక్లరేషన్‌పై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయకపోతే సెప్టెంబర్ 10 నుంచి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులను, మంత్రులను ఘెరావ్ చేస్తామని, త్వరలోనే విజయవాడలో 72 గంటల దీక్ష చేపడతామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికా వ్యయంలో 25 శాతం నిధులను ఏడాదికి రూ.10 కోట్లకు తగ్గకుండా ఉప ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించిన చంద్రబాబు దానిపై ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కడియాల çసూర్యనారాయణ, లంకా వెంకటేశ్వర్లు, తామాడ పెద్దిరాజు, అంబటి గురుమూర్తి, రాజా మురళీకృష్ణ, మాగంటి హేమ సుందర్, గొట్టేటి అరుణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement