- ఎన్నికల హామీలను విస్మరించిన సీఎంకు గుణపాఠం తప్పదు
- రాజధాని అభివృద్ధి అంటూ ప్రజా ధనం దుర్వినియోగం
- కాటసాని రామిరెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది
- బనగానపల్లె ప్లీనరీలో గౌరు వెంకటరెడ్డి
బనగానపల్లె: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 600 అబద్దపు హామీలు ఇచ్చి విస్మరించిన సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బనగానపల్లె హరిహర జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరు మాట్లాడుతూ 2014లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లతో పట్టు సాధించిందన్నారు. 2019 ఎన్నికల్లో పత్తికొండ నుంచి చెరకులపాడు నారాయణరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డిలు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయని చెప్పారు. దీంతో రాజకీయంగా ఎదుర్కోలేకనే పత్తికొండ నియోజకవర్గ నాయకుడు చెరకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు.
టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం కనుమరుగైందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు కాగా, టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుతమ్ముళ్లకే ఇళ్లు కేటాయిస్తుందని విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని కుటుంబం 30 సంవత్సరాలుగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా బనగానపల్లె ప్లీనరీకి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలిరావడం చూస్తే వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు.
కుట్రలతో అడ్డుకోలేరు: బీవై రామయ్య, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి
కుట్రలు, కుతంత్రాలతో వైఎస్‌ఆర్‌సీపీని అడ్డుకోలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు దోచుకోవడం, దాచుకోవడం, అధికారులను బెదిరించడం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చేసేందేమి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీల మధ్య చిచ్చు పెడుతూ నిధులు మంజూరు చేయడం లేదు. ముస్లిం మైనార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికి ఒక్క ముస్లిం ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి.
టీడీపీపై అసంతృప్తికి ఇదే నిదర్శనం : బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి
అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ పాలనలో అమలుపరిచిన అభివృద్ధి పథకాలను నేడు చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చినా విజయవంతంగా అమలు చేయలేకపోయారు. టీడీపీపై రోజురోజుకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్లీనరీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలే ఇందుకు నిదర్శనం.
లోకేష్ మంత్రిగా అనర్హుడు : రాజగోపాల్‌రెడ్డి , నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే లోకేష్ ఓటమి చెందుతాడన్న భయంతోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ మంత్రిగా అనర్హుడు. ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల్లో నుంచి వస్తారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సార్లు తన పదవులకు రాజీనామా చేసి అఖండ మెజార్టీతో గెలిచారు.