'పరువు పోతోంది.. రైల్వే జోన్ ప్రకటించండి'
- విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు సీఎం చంద్రబాబు లేఖ
- విశాఖ-రాయ్‌పూర్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు వినతి
హైదరాబాద్ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్‌పై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడుస్తున్నా జోన్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుందని వివరించారు. ఈ మేరకు చంద్రబాబు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాశారు.
ఏపీలో రైల్వే జోన్‌పై బడ్జెట్‌లో కేంద్రం నోరు మెదపకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్‌కు ముందు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుని కలిసి జోన్ విషయం చర్చించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని, ప్రధాని కార్యాలయం కూడా రైల్వే బోర్డుకు ఆదేశాలిచ్చిందని టీడీపీ పెద్దలంతా ప్రచారం చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రైల్వే జోన్ కచ్చితంగా ప్రకటిస్తారని తమకు సమాచారముందని తనదైన శైలిలో మీడియా ఎదుట ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకొచ్చారు.
అయితే 25న బడ్జెట్‌లో రైల్వే జోన్ ఊసే లేకపోవడంతో విశాఖవాసులతో పాటు ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచి రైల్వే జోన్ సాధిస్తామని చంద్రబాబు ప్రకటనల్ని ఉటంకిస్తూ ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. దీంతో పరువు పోతుందని, రైల్వే జోన్ ప్రకటన చేయాలని తాజాగా చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి కి లేఖ రాశారు. సరుకు రవాణాకు పీపీపీ విధానంలో మూడు కారిడార్లు ప్రకటించడంపైనా, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
విశాఖపట్టణం-రాయ్‌పూర్ సరుకు రవాణా కారిడార్‌పై కూడా ప్రకటన చేయాలని, ఈ కారిడార్ ఖరగ్‌పూర్-ముంబయి కారిడార్‌ను తాకుతూ వెళుతుందని లేఖలో పేర్కొన్నారు. విశాఖ-రాయపూర్ కారిడార్‌తో కోస్తా తీరం వెంబడి పోర్టుల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని సురేశ్ ప్రభుకు సోదాహరణంగా వివరించారు.