ముద్రగడ దీక్షపై స్పందించిన చంద్రబాబు
కడప: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని ఆయన గురువారమిక్కడ అన్నారు. కష్టాల్లో ఉన్నామని, రాష్ట్రంలో సమస్యలు సృష్టించవద్దంటూ చంద్రబాబు ఈ సందర్భంగా ముద్రగడతో పాటు ఇతరులకు విజ్ఞప్తి చేశారు. అరాచకాలు సృష్టిస్తే వ్యవస్థని ఎవరు కాపాడతారని అన్నారు.
వ్యక్తిగత సమస్యలపై ఇష్టారీతిలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తునిలో రైలును దగ్ధం చేసిందెవరని, రౌడీలను అరెస్ట్ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. నేరాలు ఎక్కడా జరగటానికీ వీల్లేదన్నారు. కాపుల రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం పూర్తి స్పష్టత ఉందన్నారు. అందుకోసం కాపు కమిషన్తో పాటు కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని చంద్రబాబు కోరారు.