ప్రశ్నిస్తేనే విద్యారంగంలో మార్పు సాధ్యం
► విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
► రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త అందె సత్యం
మిర్యాలగూడ అర్బన్ : యువత చైతన్యవంతులై పాలకులను ప్రశ్నిస్తేనే విద్యారంగంలో మార్పు సాధ్యమని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త అందె సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ణానిక శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు యువత ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకుల విధానాల కారణంగానే విద్య పేదలకు అందని ద్రాక్షగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ జీడీపీలో 6శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ కమిషన్ గతంలోనే చెప్పినా పాలకులు నేటికీ కేవలం 3.9 శాతం నిధులనే కేటాయిస్తున్నారని అన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిలోకం సంఘటితంగా పోరాడి ప్రభుత్వ విద్యను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, కోట రమేశ్, ఆలిండియా సైన్స్ జాతీయ వేదిక కార్యదర్శి తాటి రమేష్ పాల్గొన్నారు.