– జీఎస్టీ అమలు ఎఫెక్ట్..
హిందూపురం రూరల్ : జిల్లాలో సరిహద్దు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలు శనివారం మూతపడ్డాయి. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులు తనిఖీలకే పరిమితమయ్యాయి. జీఎస్టీ అమలుకావడంతో జులై 1 నుంచి మూసేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దాంతో శనివారం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడికొండ చెక్‌పోస్టు, తూముకుంట చెక్‌పోస్టు, గుంతకల్లు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలను మూసివేశారు. వీటిలో డీసీటీలు 20 మంది, ఏసీటీఓలు 40 మందితో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వాణిజ్య పన్నుల శాఖకు చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.వంద కోట్ల ఆదాయం వచ్చేది. కొత్త విధానంతో ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్లనుంది.దీంతో తప్పనిసరిగా మూసివేసి డీసీటీఓ స్థాయి అధికారి నుంచి సీనియర్ అసిస్టెంట్ అధికారి వరకు కర్నూలులోని వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్‌కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని, అటెండర్ స్థాయి ఉద్యోగులు జిల్లా డీసీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు.
పట్టుబడితే భారీ జరిమానా :
అక్రమంగా సరుకు రవాణా చేస్తూ మొబైల్ తనిఖీ బృందాలుకు దొరికితే భారీగా జరిమానా విధించినట్లు వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్లో వేబిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే పట్టుపడిన సరుకుపై ఏడు రెట్లు జరిమానాతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయునున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.