నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
సోమందేపల్లి : స్థానిక రంగనాయకులు కాంప్లెక్స్ (ఎన్టీఆర్ సర్కిల్) వద్ద ఉన్న ఓ నీటి తొట్టెలో పడి మనోజ్ కుమార్ (5) అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని యాకర్లపల్లికు చెందిన రవి, సుభాషినమ్మ దంపతులకు మనోజ్ కుమారుడు. సుభాషినమ్మ చెల్లెలుకు పెళ్లి కుదరడంతో ఆమె భర్త, కుమారుడితో కలిసి సోమవారం పుట్టిళ్లయిన గుడ్డం నాగేపల్లికి వచ్చింది. పెళ్లి పనుల్లో భాగంగా ఇంటికి రంగు కొనేందుకు మంగళవారం సుభాషినమ్మ తన కుమారుడు మనోజ్‌కుమార్, సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి సోమందేపల్లికు వచ్చింది.
పెయింటింగ్స్ కొనుగోలు చేస్తుండగా మనోజ్ ఆడుకుంటూ దగ్గరలో ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. అయితే ఇది గమనించిన సుభాషినమ్మ, శ్రీకాంత్‌లు బాబును ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకూ చిన్నారి కోసం వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి స్థానికులు పెయింట్ షాప్‌కు దగ్గరలో ఉన్న ఓ నీటితొట్టెలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ వెదికారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రవి, సుభాషినమ్మ తమ కుమారుడు ఇక లేడని బోరున విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
తనకల్లు : మండల కేంద్రానికి చెందిన శ్రీలేఖ (17) అనే విద్యార్థిని అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గంగన్న కుమార్తె శ్రీలేఖ కదిరి బ్లూమూన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో తాను పాస్ అవుతానో లేదోనని తరచూ మదనపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషపూరిత ద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.