’గోళ్లు’మాల్
’గోళ్లు’మాల్
Published Sun, Mar 5 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
వివాదాస్పదంగా చిరుతపులి చర్మం కేసు
పులిగోళ్లను కొన్న టీడీపీ నేతలు
కేసు మాఫీకి యత్నాలు
రంగంలోకి జిల్లా ఎంపీ
నోరుమెదపని అటవీ అధికారులు
జంగారెడ్డిగూడెం : ఇటీవల జంగారెడ్డిగూడెంలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న చిరుతపులి చర్మం కేసు వివాదాస్పదమైంది. ఈ కేసులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో చిరుత పులి గోళ్లు ఏమయ్యాయో అటవీశాఖాధికారులు వెల్లడించలేదు. దీనికి కారణం ఆ గోళ్లను స్థానిక టీడీపీ నాయకులు కొనుగోలు చేయడమే. దీనిని అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. విషయం బయటకు పొక్కకుండా జిల్లాకు చెందిన ఓ ఎంపీ రంగప్రవేశం చేశారు. అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చి విషయం బయటకు రాకుండా చేశారు. స్థానిక టీడీపీ నాయకులు చిరుతపులి గోళ్లను కొని పైస్థాయి నాయకులకు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాక చిరుతపులి గోళ్లను ఎవరి నుంచి కొన్నారో ఆ వ్యక్తిని బయటకు రాకుండా ఏలూరు ఆసుపత్రిలో చేర్చి వైద్యం నెపంతో దాచారు.
అసలు జరిగిందేమిటంటే..!
దొరమామిడికి చెందిన బవిరిశెట్టి పవన్‌కుమార్ తన వద్ద చిరుత చర్మం ఉందని, అమ్మతానని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అటవీశాఖాధికారులు వలపన్ని చర్మం కొనుగోలుదారులుగా మారి ఈనెల 1న స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టుకున్నారు. అతని వద్ద చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించగా బుట్టాయగూడెం మండలం మోతుగూడెం అటవీ ప్రాంతంలో గిరిజనుల నుంచి రూ. 50వేలకు కొన్నట్టు చెప్పాడు. దీంతో అధికారులు మోతుగూడెంకు చెందిన కెచ్చెల రాంబాబు, గోగుల సోమిరెడ్డి, కెచ్చెల సోమిరెడ్డి, గూగుంట్ల పండయ్య, గూగుండ్ల చిన్నారెడ్డి, గోగుల శ్రీను, కోర్సావారిగూడెంకు చెందిన పూనెం నాగేశ్వరరావులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన గిరిజనులు గత ఏడాది ఆగస్టులో పాతమోతుగూడెం అడవిలో పశువుల పాక వద్ద ఆవుపై చిరుతపులి దాడి చేయడంతో బాణాలతో చిరుతను కొట్టి చంపి చర్మాన్ని , గోళ్లను వేరుచేసి మృతదేహాన్ని మరికొయ్యబాట వద్ద ఖననం చేసినట్లు వెల్లడించారు. చిరుతపులి చర్మం బవిరిశెట్టి పవన్‌కుమార్ కొనగా, గోళ్లను మరొక వ్యక్తి కొన్నారని వివరించారు. గోళ్లను కొన్న వ్యక్తి మధ్యవర్తుల ద్వారా జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులకు 18 గోళ్లను రూ.2లక్షలకు అమ్మినట్టు సమాచారం. స్థానిక నాయకులు ఆ గోళ్లను పైస్థాయి టీడీపీ నాయకులకు బహుమతిగా పంపారని తెలిసింది. వాస్తవానికి పులిగోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో వేసి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను వాడరు. స్థానిక నాయకులు పులిగోళ్లు అని పైస్థాయి నాయకులకు బహుమతి ఇచ్చి బురిడీ కొట్టించారని సమాచారం.
అధికారుల మౌనం
ఇదిలా ఉంటే అటవీశాఖాధికారులు మాత్రం చిరుతపులి గోళ్లు వివరాలపై నోరు మెదపడం లేదు. చిరుతపులి గోళ్లను అమ్మిన వ్యక్తిని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స నెపంతో చేర్చి రహస్యంగా దాచారు. గోళ్లు కొన్న విషయం బయటకు పొక్కకుండా జిల్లా ఎంపీ రంగప్రవేశం చేసి అటవీశాఖాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1972 వన్య ప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం ఘటనలో కారకులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలి. అయితే ఆవుపై దాడిచేసిన చిరుతను చంపిన ఏడుగురు గిరిజనులు, చర్మం అమ్మేందుకు యత్నించిన వ్యక్తిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. గోళ్లు ఏమయ్యాయి. ఎవరు కొని ఎవరికి అమ్మారు అనేది అధికారులు చెప్పడం లేదు. అయితే గిరిజనులు మాత్రం గోళ్లను ఎవరికి అమ్మింది అధికారులకు చెప్పినా ఆ వ్యక్తి వివరాలు వెల్లడించడం లేదు. ఆ వ్యక్తినే టీడీపీ నాయకులు దాచిపెట్టి కేసు మాఫీకి పెద్ద ఎత్తున యత్నిస్తున్నారని తెలుస్తోంది.
విచారిస్తున్నాం:
చిరుతపులి గోళ్లు ఏమయ్యాయనేది విచారిస్తున్నాం. గోళ్లను గిరిజనులు ఏం చేశారనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి పులి గోళ్లను మాత్రమే బంగారు గొలుసుల్లో పెట్టి ధరిస్తారు. చిరుతపులి గోళ్లను ధరించరు. ఒకవేళ ఆ గోళ్లను ఎవరైనా కొంటే వాళ్లు పిచ్చివాళ్లే.
రవికుమార్, కన్జర్వేటర్, అటవీశాఖ
Advertisement
Advertisement