నీటిలో క్లోరిన్ ఎంతుంది?
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
దుర్గాఘాట్, వీఐపీ ఘాట్‌లోని నీటిలో ప్రతి గంటకు ఒకసారి క్లోరిన్ శాతాన్ని వాటర్ బోర్డు సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. సీతానగరంలోని కృష్ణానది జలాలలో ప్రమాదకరమైన ఈ–కొలి బ్యాక్టీరియా ఉందనే కథనాలతో అప్రమత్తమైన వాటర్ బోర్డు సిబ్బంది ప్రతి గంటకు ఘాట్‌లోని నీటిని తనిఖీ చేస్తున్నారు. క్లోరిన్ కలపడం వల్ల నీటిలో వ్యాధికారకాలు నశిస్తాయి. సాధారణ స్థాయిలో క్లోరిన్ 0.5 పీపీ ఉండాల్సి ఉండగా, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 1 పీపీ క్లోరిన్ ఉండేలా చూస్తున్నట్లు విశాఖపట్నం రీజనల్ పబ్లిక్ హెల్త్ వాటర్ ఎనలిస్టు పీ. వెంకటరమణ పేర్కొన్నారు. నీటిలో ఏ మాత్రం క్లోరిన్ శాతం తగ్గుముఖం పట్టినా వెంటనే పెంచుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం స్నాన ఘాట్లలో క్లోరిన్ బస్తాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గంట..గంటకు నీటి తనిఖీలు: మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ (వన్‌టౌన్) :
కృష్ణానదిలో నీటిని గంటగంటకు పరీక్షలు చేసి చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దుర్గాఘాట్‌ను పరిశీలించారు. నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో నీటి నమూనాలను పరిశీలించారు. నీటి ప్రవాహం నిల్వ ఉంటేనే సమస్యలు ఉంటాయని, దుర్గాఘాట్‌లో నీటి ప్రవాహం 90శాతం ముందు కు వెళ్లిపోతూ ఉంటుందని ఎటువంటి ఇబ్బందులు ఉండవని సిబ్బంది వివరించారు. భక్తులకు వైద్య సౌకర్యాల గురించి, డ్వాక్రా స్టాల్స్‌ను పరిశీలించారు. అలాగే భక్తులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.