చెలరేగుతున్న బుకీలు
ప్రొద్దుటూరు క్రైం:
కొన్ని రోజుల క్రితం వరకూ బెట్టింగ్ నిర్వహించాలంటేనే బుకీలు భయపడే వారు. ప్రొద్దుటూరును వదలి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్లి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడి పోలీసులు క్రికెట్ బెట్టింగ్, మట్కాలను కట్టడి చేయడమే గాక కేసులు కూడా నమోదు చేశారు. దీంతో రెండు నెలల నుంచి జిల్లాలో క్రికెట్ పందేలు నిర్వహణ బాగా తగ్గిందని చెప్పవచ్చు. పోలీసులు బడా బుకీల మీదే దృష్టి సారించడంతో ఛోటా బుకీలు ఇదే అదనుగా భావించి బాగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో బడా బుకీలకు అసిస్టెంట్‌లుగా, కొరియర్ బాయ్‌లుగా పని చేసిన వారు ఇపుడు బుకీల అవతారం ఎత్తి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఈ తరహా బుకీలు కూడా రూ.లక్షల్లో లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల చర్యలు ఏవి ?
జిల్లాలో ప్రొద్దుటూరు ప్రధాన ప్రాంతం. ఇక్కడ కొన్ని రోజుల క్రితం వరకు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నిఘా ఉండేది. దీంతో పట్టణంలో బెట్టింగ్ రాయాలంటేనే పందెం రాయుళ్లు జంకే పరిస్థితి ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి ఎందుకో మరి పోలీసులు దాడులకు స్వస్తి చెప్పారు. పట్టణంలో బెట్టింగ్ ఎక్కడా జరగడం లేదని కింది స్థాయి సిబ్బంది చెప్పడంతో ఉన్నతాధికారులు దాడులు చేయడం లేదని తెలుస్తోంది. కాగా జమ్మలమడుగు, కడప, కదిరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చి బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. కొత్త వ్యక్తులను పోలీసులు గుర్తు పట్టే అవకాశం లేనందున వారు బహిరంగంగానే పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గుంటూరు, కదిరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఆరుగురు బుకీలను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా క్రి కెట్ పందేలు కాస్తున్నారు. పోలీసు అధికారులు బెట్టింగ్‌ను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ ప్రాంతాల్లో జోరుగా..
క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయాల్లో వైఎంఆర్ కాలనీలోని పార్కు సమీపంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి, దస్తగిరిపేట, మోడంపల్లె, వన్‌టౌన్ సమీపంలోని జెండా చెట్టు సమీపంలో, సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. పందేలు నిర్వహిస్తున్న బుకీలు గుర్తింపు లేని వారు కావడంతో వారి ఆటలు సాఫీగా సాగుతున్నాయి. కాగా చాలా మంది బుకీలు బెట్టింగ్‌లో ఇటీవల భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. దస్తగిరిపేట, వన్‌టౌన్ ప్రాంతం, మోడంపల్లె, గంగమ్మ ఆలయం వీధి, జిన్నారోడ్డు, భగత్‌సింగ్ కాలనీలకు చెందిన ప్రధాన బుకీలు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఎవ్వరినీ వదలం
క్రికెట్ బెట్టింగ్‌ను పూర్తి స్థాయిలో అరికడతాం. ప్రత్యేకంగా నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తాం. బుకీలతోపాటు ఇకపై రాసే వారు పట్టుబడినా కూడా కేసులు నమోదు చేస్తాం
– పూజితానీలం, ప్రొద్దుటూరు డీఎస్పీ