మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి తరగతులు నిర్వహించాలని సర్కారు సంకల్పించింది. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. అయితే అక్కడ భవనాల నిర్మా ణం, మౌలిక సదుపాయాల కల్పన వంటివి పూర్తికాలేదు. జిల్లా ఆసుపత్రిని మాత్రమే బోధనాసుపత్రిగా చూపించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఎంసీఐ ఇటీవల తనిఖీలు చేసి, చైర్మన్‌కు నివేదిక సమర్పించింది.
వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు ఎంసీఐ ఒప్పుకొనే పరిస్థితి లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నుంచే అక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి తరగతులు నిర్వహించాలనేది సర్కారు సంకల్పం. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్, అడ్మిషన్లు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన మేర భవనాలు పూర్తిచేస్తామని ఎంసీఐకి హామీ పత్రం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వైద్య విద్య డెరైక్టర్ రమణి తదితరులు గురువారం ఢిల్లీ వెళ్లిహామీ పత్రం ఇస్తారని సమాచారం.