హోదా ఇవ్వకపోయినా ఎన్డీఏలోనే
♦ ప్రస్తుత పరిస్థితుల్లో బయటికొస్తే నష్టమే
♦ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు
♦ వైఎస్ జగన్‌పై ఎదురుదాడి చేయాలని హితోపదేశం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికొచ్చే పరిస్థితి లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రులు పార్లమెంటులో చేసిన ప్రకటనలు, బీజేపీతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై ఆయన టీడీపీ ముఖ్య నేతలతో తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమావేశమై చర్చించారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రులు చెప్పినా కేంద్రంలో ఇద్దరు మంత్రుల్ని కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో దాన్నెలా సమర్థించుకోవాలనే విషయమై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
కేంద్రం మొండిగా ఉన్నందున ఎన్డీయే నుంచి బయటికొచ్చినా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదని, అలాంటప్పుడు మంత్రివర్గంలో కొనసాగడమే మేలని చెప్పారు. పార్లమెం టులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, సహాయమంత్రులు ఏపీకిచ్చిన నిధులపై చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర వాటా ప్రకారం సాధారణంగా ఇచ్చే నిధుల్ని ప్రత్యేకంగా ఇచ్చినట్లు వారు చెప్పడం సరికాదన్నట్లు సమాచారం. వారు చెబుతున్నదాంట్లో నిజంలేదనే విషయాన్ని ప్రజలకర్థమయ్యేలా చెప్పాలన్నారు. అదేసమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకునేరీతిలో మాట్లాడవద్దని ఆయన పార్టీశ్రేణులకు సూచించినట్టు సమాచారం. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై ఆందోళనలకు పిలుపునివ్వడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఆయనపై ఎదురుదాడి చేయాలని నేతలకు సీఎం హితోపదేశం చేశారు.
‘అమృత్’ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీలు
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకం కింద ఎంపికైన మున్సిపాల్టీల్లో అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పనకు కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని 31 మున్సిపాలిటీల అభివృద్ధిపై ఆయన ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి
విభజన తర్వాత జరుగుతున్న రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
విదేశీ పర్యటనకు చంద్రబాబు
సీఎం ఆదివారం రాత్రి 12.20 గంటలకు విదేశీ పర్యటనకు బయలుదేరారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు రాత్రి 10 గంటలకు చేరుకున్న చంద్రబాబు అక్కడినుంచి థాయిలాండ్‌కు వెళ్లారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ చంద్రబాబు తన కుటుంబ సభ్యులందరితో కలసి స్విట్జర్లాండ్ వెళ్తారు.