జడ్చర్లలో విలేకరులతో మాట్లాడుతున్న టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
సీఎం కేసీఆర్ అసమర్థత పాలన కారణంగానే ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మరణాలు, సరోజినదేవీ కంటి ఆస్పత్రిలో కళ్లు పోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. సోమవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు.
-
టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్య
జడ్చర్ల టౌన్: సీఎం కేసీఆర్ అసమర్థత పాలన కారణంగానే ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మరణాలు, సరోజినదేవీ కంటి ఆస్పత్రిలో కళ్లు పోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. సోమవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ ద్వారా 56వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే గతంలో 85సార్లు లీకేజీ అయ్యాయని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోగులు పిట్టల్లా రాలిపోతుంటే అవి సహజ మరణాలు చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. గాల్లో దీపం పెట్టి దేవుడా..నీవే దిక్కు అనే చందంగా టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని రమణ విమర్శించారు. ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సంపన్నరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రతిపక్షాలు, మేధావుల సలహాలు తీసుకోవాలని హితవుపలికారు. జిల్లా మంత్రులు పాలన వదిలేసి టీడీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. కాకతీయల కాలం నాటి చెరువులకు కల్వకుంట్ల మరమ్మతులు అంటూ ఎద్దేవాచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.