‘నీరు’కేళం కాదు సుమా..
అమలాపురం :
కొబ్బరిని ‘నారికేళం’ అని కూడా అంటారు. తోటల్లో, గట్లపై, పెరళ్లలో పెరిగే ఈ చెట్ల మెుదళ్లలో నీరు ఎక్కువైతే వేర్లు దెబ్బతిని చెట్టు చనిపోయే అవకాశముంది. అలాంటిది మెువ్వు వరకూ చెరువులో మునిగిన ఈ ఫొటోలోని కొబ్బరిచెట్టు ‘ఎలా బతికి ఉందో?’ అనిపిస్తుంది. అసలు సంగతేమిటంటే.. తల తప్ప నిలువెల్లా నీట మునిగినట్టు కనిపిస్తున్న ఈ చెట్టు మెుదలు చెరువులో కాక గట్టున ఉంది. అయితే.. వంపులు తిరిగిన చెట్టు చెరువులోకి ఒరిగిపోవడంతో కాండంలో చాలాభాగం నీట మునిగి, తలభాగం చెరువు మధ్యలో కనిపిస్తోంది. అంతరచిత్రం చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. అంబాజీపేట శివారు భేతాళస్వామి గుడి సమీపంలోని చెరువులో ఈ తమాషా దృశ్యాన్ని చూడవచ్చు.