ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం
నెల్లూరు(పొగతోట): అనుమతి లేకుండా సెలవులు పెట్టడం, సెలవు పెట్టకుండానే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. అనుమతి లేకుండా సెలవులు పెడుతున్న ఎంపీడీఓలను పంచాయతీరాజ్ కమిషనర్‌కు సరెండర్ చేస్తానని హెచ్చరించారు. విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూ చించారు. స్మార్ట్ పల్స్ సర్వేను ఈ నెలఖారులోపు పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, డ్వామా పీడీ హరిత తదితర అధికారులు పాల్గొన్నారు.