కలరా కలవరం
-
బోథ్‌లో బయటపడ్డ వైనం
-
రిమ్స్, స్థానిక ఏరియా ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షలు
-
నమూనాలు సేకరించిన వైద్య, ఆరోగ్యశాఖ
-
క్లోరినేషన్ లేకపోవడంతోనే కలరా వ్యాప్తి
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో కలర కలవర పెడుతోంది. వర్షాకాలంలో ప్రతి ఏడాది అతిసారం, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రజలను భయపెట్టేవి. తాజాగా జిల్లాలో కలరా వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బోథ్ సివిల్ ఆస్పత్రిలో 20 మంది కలరా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. బోథ్‌లో కలర వ్యాప్తి చెందినట్లు ప్రచారం కావడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. దీంతో ముందస్తుగా కలరాను గుర్తించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా బుధవారం కలెక్టర్ జగన్మోహన్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జలపతినాయక్‌తో కలిసి బోథ్ ఆస్పత్రిని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిర్ధారణకు ఆస్పత్రి నుంచి 30 నమూనాలు సేకరించారు. బోథ్ ఆస్పత్రితోపాటు, జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నిర్ధారించేందుకు నమూనాలను బుధవారం పంపించారు. గురువారం ఈ పరీక్షల ఫలితాలు రానున్నాయి.
క్లోరినేషన్ లేకపోవడంతోనే..
గ్రామాలు, కాలనీల్లో అపరిశుభ్రమైన కాలుష్యం, కలుషితమైన తాగునీటితో కలర వ్యాధి వస్తుంది. వర్షకాలంలో వర్షం నీరు రావడంతో నీటికాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా తాగునీటినిలో క్లోరినేషన్ లేకపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం బోథ్‌తోపాటు కౌఠ–బి, పొచ్చెర, ధన్నోర వంటి గ్రామాల్లో పర్యటించిన అధికారులు ప్రజలు కలుషిత నీరు తాగుతుండడం, అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. బోథ్ ఆస్పత్రికి కలరా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఆయా గ్రామాల్లో క్లోరినేషన్ మొదలుపెట్టారు. కౌఠ–బిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కాగా.. గిరిజన ప్రాంతాలైన జైనూర్, నార్నూర్, సిర్పూర్, ఉట్నూర్, కాగజ్‌నగర్, కౌటాల, చెన్నూర్ వంటి మండలాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. ఎక్కడ చూసినా మురికి గుంతలు, వాటిలో పేరుకుపోయిన దోమలతో వాతావరణం కలుషితమవుతోంది. దీనికితోడు ప్రజలు కలుషిత నీరు తాగుతుండడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కలరా వ్యాప్తి చెందకముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో ముందస్తుగా జాగ్రత్తగా తాగునీటిన క్లోరినేషన్ చేయాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఆయా పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేసి, ముందస్తుగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం..
– జలపతినాయక్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
కలరా వ్యాధి లక్షణాలు కనిపించడంతో నివారణ చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగానే బోథ్‌లోని కౌఠలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రజలు అపరిశుభ్ర వాతారణం లేకుండా చూసుకోవాలి. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి.