అణు నిర్వాసితులకు నష్టపరిహారం జమ!
► బ్యాంక్ ఖాతాల సేకరణలో అధికారులు
► ఎకరాకు రూ.15 లక్షలు జమ చేసేందుకు సన్నాహాలు
రణస్థలం: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు తొలి అడుగు పడుతోంది. కొవ్వాడ నిర్వాసిత ప్రాంత ప్రజలకు నష్టపరిహారం అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అదివారం విలేకరులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె.సీతారామరావు మాట్లాడారు. కొవ్వా డ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నామని తెలిపారు. భూములసంబంధిత పత్రాలు సక్రమంగా ఉంటే.. మరో రెండు రోజుల్లో నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమఅవుతుందని చెప్పారు. డీ పట్టా, జిరాయితీ భూము లకు ఒకే రేటు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఎకరాకు రూ.15 లక్షల చొప్పున నగదు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. నిర్వాసితులు ఎకరాకు రూ.18 లక్షల డిమాండ్ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి అణువిద్యుత్ అకౌంట్లో రూ. 500 కోట్లు జమైనట్లు చెప్పారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి 30వ తేదీ లోపు కొంత మేరకు పరిహారం ఫండ్ ఖర్చు చేయాలన్నారు. అలాంటి పక్షంలో మరో రూ.700 కోట్ల పరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అకౌంట్‌లో జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.శ్రీరాములు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం,గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
జీఓ విడుదల: అణువిద్యుత్ కేంద్రం పార్కు నిర్మాణంలో భాగంగా కొవ్వాడలో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం జీఓ 1179 విడుదల చేసింది. మొత్తం 2,438 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో డీ పట్టా భూములు 1,473 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు జీఓ 1179 ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు. అణు నిర్వాసిత భూములకు రూ.18 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జీఓలో పేర్కొన్నారు.