'పార్టీ మారే ప్రసక్తే లేదు'
పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు.
హైదరాబాద్: పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో దానం గురువారం కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ అధిష్టానంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠం కాంగ్రెస్దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ వలసలను ప్రోత్సహించడం సాధారణమన్నారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వలసలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నామన్నారు.
కాగా నగర అధ్యక్షునిగా ఉంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తీరుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సైతం అసహనం వ్యక్తం చేస్తూ, రెండుమూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలని టీపీసీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీపీసీసీ బుధవారం నాగేందర్‌కు ఒక లేఖను పంపింది. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అందులో పార్టీలో కొనసాగుతారా, లేదా అన్న విషయమై వెంటనే తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యఅనుచరులతో సమావేశమై చర్చించారు.