'ఈస్టిండియా కంపెనీలా చంద్రబాబు పాలన'
చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన మట్టి సత్యాగ్రహం ముగింపు కార్యక్రమాన్ని బుధవారం చిత్తూరుజిల్లా చంద్రగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తిరుపతిలో నిర్వహించిన సభలో మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు రాష్ట్రానికి ఐదు కాదు.. పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదంటూ కుంటి సాకులు చెప్పి నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు.
కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబుకు దెయ్యం పట్టిందని ఆ దెయ్యాన్ని ప్రజలే వదిలిస్తారన్నారు. కేవలం ఒక శాతం ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అది కూడా మోదీ కాళ్లు, పవన్ కల్యాణ్ నడుము పట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరాన్ని పక్కన పెట్టి తన వారికి కోట్లు ముట్టజెప్పేందుకు పట్టిసీమను తెరపైకి తీసుకువచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.