కష్టాలు వింటూ.. భరోసా ఇస్తూ..
* కొనసాగుతున్న గడప గడపకు వైఎస్సార్
* టీడీపీ నేతల హామీలు నమ్మి మోసపోయామంటూ
వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట జనం ఆవేదన
సాక్షి, గుంటూరు: ‘గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు.. అధికారంలోకొచ్చాక వాటి అమలే మరిచా రు.. జనాన్ని నిలువునా మోసంచేశారు..’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట జనం ఆవేదన వ్యక్తంచేశారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం శనివారం రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేట, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల్లో జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి టీడీపీ పాలనపై ప్రజాబ్యాలెట్ అందజేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను వివరించారు. చెరుకుపల్లి మండలం గొలుసులపాలెంలో డ్వాక్రా మహిళలు వెంకటేశ్వరమ్మ, సులోచన, విజయకుమారి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారని, రుణమాఫీ జరగకపోగా, వడ్డీలు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. టీడీపీ నేతలు ఈసారి ఏముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారో చూస్తామని స్పష్టం చేశారు. దీనిపై మోపిదేవి స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలు తీరుస్తామంటూ వారికి భరోసా ఇచ్చారు.
ఆ మూడు వేలు కూడా తీయనీయడం లేదు..
డ్వాక్రా రుణమాఫీ జరగకపోగా, బ్యాంకులో మొదటివిడతగా వేసిన రూ.3 వేల మూలధనాన్ని సైతం బ్యాంకర్లు డ్రా చేసుకోనీయడం లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట పిట్టలవానిపాలెం మండలం కక్కుర్తివారిపాలేనికి చెందిన దాసరి సుందరమ్మ అనే మహిళ వాపోయింది. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇప్పిస్తామంటూ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదంటూ అదే గ్రామానికి చెందిన సాంబమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో రాజన్న పాలన రాబోతోందని, అప్పుడు మహిళలందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కోన రఘుపతి వారికి హామీ ఇచ్చారు.
పింఛను ఇవ్వటం లేదు..
అయ్యా రేషన్ కార్డు లేదు.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదంటూ చిలకలూరిపేట పట్టణం 34వ వార్డుకు చెందిన రామసుబ్బాయమ్మ, భర్త చనిపోయి ఇబ్బంది పడుతుంటే వితంతు పింఛను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ శౌరమ్మ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట వాపోయారు. దీనిపై మర్రి స్పందిస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మహిళల కష్టాలన్నీ తీరుతాయంటూ భరోసా ఇచ్చారు.
* దుగ్గిరాలలో కాఫీ పొడి ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగునీరు తాగునీటిలో కలిసి పోయి రోగాలబారిన పడాల్సి వస్తోందని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కల్యాణమండపం ఏరియాకు చెందిన బాకిరాజు, జిలానీ, సుబ్బయ్య నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌కు వివరించారు.
* డ్వాక్రా రుణమాఫీ కాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి పొదుపు డబ్బును బ్యాంకులు జమ చేసుకుంటున్నాయంటూ ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన ఆకారపు మల్లేశ్వరి అనే మహిళ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఎదుట వాపోయింది. స్పందించి న క్రిస్టినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలుతీర్చుతామని హామీఇచ్చారు.