
అధునాతన పద్ధతిలో కానిస్టేబుళ్లకు శిక్షణ
పోలీసు కానిస్టేబుళ్లకు అధునాతన పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆదిలాబాద్ : పోలీసు కానిస్టేబుళ్లకు అధునాతన పద్ధతిలో ఇవ్వనున్నట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో శిక్షణ కేంద్రంలోని ఇండోర్, ఔట్‌డోర్ ఫ్యాకల్టీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఎంపికైన నాలుగు జిల్లాల అధికారులు జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. వీరు అంబర్‌పేట్‌లోని ప్రధాన శిక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని పేర్కొన్నారు. మైదానంలో పరేడ్ శిక్షణ ఇచ్చే అధికారుల్లో ఆర్‌ఐ–1, ఏఆర్ ఎస్సై 4, ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్ల 27, సివిల్ ఎస్సైలు 4, హెడ్‌కానిస్టేబుళ్లు 12 మంది ఉంటారని తెలిపారు. ప్రిన్సిపల్‌గా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, వైస్ ప్రిన్సిపల్‌గా కె.సీతారాములు ఉంటారని పేర్కొన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ వృత్తి ఎంతో కీలకమని అన్నారు.
ఫ్యాకల్టీ అధికారులకు స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో డీఎస్పీ సమక్షంలో పరేడ్ శిక్షణ చేయిస్తూ రాబోయే శిక్షణ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని సూచించారు. సివిల్ ఎస్సైలు చట్టంలోని భారతీయ శిక్షా స్మృతి, సాక్షాధారాలు, చట్టం పరిపాలన తదితర అంశాలపై రోజు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సరైన సామర్థ్యం చూపిన వారికి ప్రశంస పత్రాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా శిక్షణ సమయంలోనే కానిస్టేబుళ్లకు ల్యాప్‌టాప్‌లు అందించి కంప్యూటర్ పరిజ్ఞాణంతో ఆధునికంగా సిద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీ కె.సీతారాములు, ఆర్‌ఐ బి.జెమ్స్, ఎస్.సురేంద్ర, ఎస్సైలు గంగాధర్ విష్ణు ప్రకాష్, సక్రీయనాయక్, ఏఆర్ ఎస్సైలు హబీబ్ బేగ్ పాల్గొన్నారు.