కష్టాలు + కన్నీళ్లు = కాంట్రాక్ట్ లెక్చరర్లు
కష్టాలు + కన్నీళ్లు = కాంట్రాక్ట్ లెక్చరర్లు
Published Wed, Aug 2 2017 11:21 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM
విద్యా సంవత్సరం ప్రారంభమైనా రెన్యువల్ కాని పోస్టులు
రెండు నెలలైనా విడుదల కాని వేతనాలు
రాయవరం(మండపేట) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అయోమయంలో పడ్డారు. కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడంతో పాటు జీతాలు విడుదల కాలేదు. దీంతో అధ్యాపకులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో 573 మంది..
జిల్లాలో మొత్తం 543 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 351 మంది, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 152 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 70 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
17 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో..
17ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. సబ్ కమిటీ వేసి నెల రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామన్నారని.. అయినా సమస్య ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించే వరకైనా జీవో 03 ప్రకారం పదో తేదీన సవరణ సంఘం సిఫారసుల మేరకు జీతాలు పెంచాలని కోరుతున్నారు.
2000లో నియామకం..
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాబోధన చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించింది. ప్రారంభంలో వీరికి నెలకు రూ.4,500 ఇచ్చేవారు. అదీ ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నెల జీతం రూ.8,500కు పెంచారు. 2010లో అనేక ఆందోళనల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వీరి జీతం నెలకు రూ.18వేలకు పెంచింది.
ప్రసూతి సెలవులు ఇవ్వాలి..
మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వాలి. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇప్పటికీ సర్వీసులు రెగ్యులర్ చేయకపోవడం విచారకరం. అధ్యాపక వృత్తినే నమ్ముకుని పనిచేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
– కె.వినుతకుమారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి
వేతనాలు పెంచాలి..
పదో పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి. 2000లో ఉద్యోగంలో చేరాం. ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తారనే ఆశతో జీవిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
– గుమ్మడి వెంకటరమణ, కాంట్రాక్ట్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోకవరం
ఉద్యమం చేపడతాం..
కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలుపుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలి.
– డాక్టర్ వాలుపు కనకరాజు, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాజానగరం
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..
సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు అధ్యాపకుల శ్రమను దోచుకుంటున్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి.
– ఎం.శ్రీనివాసరావు, కాంట్రాక్టు అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం
Advertisement