బైక్‌ను ఢీకొన్న కంటైనర్
కావలిరూరల్ : బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి కావలి సమీపంలో జాతీయ రహదారిపై తుమ్మలపెంట క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన మర్రిపూడి వెంకటేశ్వర్లు (50) భవన నిర్మాణ సామాగ్రి అద్దెకు ఇస్తుంటాడు. మర్రిపూడి శ్రీనివాసులు (42) స్థానికంగా కేబుల్ డిష్ నడుపుతున్నాడు. ఇద్దరు చిన్నాన్న, పెదనాన్న కుమారులు. ఇద్దరు గురువారం నెల్లూరుకు వెళ్లి పని ముగించుకుని తమ పల్సర్‌బైక్‌పై ఇంటికి వస్తున్నారు. కావలి బైపాస్ రోడ్డులో తుమ్మలపెంట బ్రిడ్జి వద్దకు రాగానే బైపాస్ రోడ్డు దిగే సమయంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొంది. బైక్ పూర్తిగా ధ్వంసం కాగా ఇరువురిని కొది ్దదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ముఖాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. బైక్‌ను ఢీకొన్న లారీ డివైడర్‌ను దాటి అవతలి వైపు రోడ్డు మార్జిన్‌లోకి దిగిపోయింది. సమాచారం అందుకు కావలి రూరల్ ఎస్సై పుల్లారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బైక్ నంబర్ ఆధారంగా మృతులను గుర్తించారు. వెంకటేశ్వర్లుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసులుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్తంభించిన ట్రాఫిక్
ప్రమాదం జరగడంతో ఒక వైపు రోడ్డులో కంటైనర్ అడ్డుగా నిలబడి పోయింది. మరోవైపు రోడ్డు మధ్యలో మృతదేహాలు పడిపోయాయి. చీకటి పడటంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై పుల్లారావు తన సిబ్బందితో కలిసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇరు మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.