ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగం
ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగం
Published Sun, Apr 16 2017 10:08 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
వైద్యశాఖలో కాంట్రాక్టు కొలువు
ఏడు నెలలుగా జీతాలు అందని వైనం
విధులు మానేస్తామంటున్న సిబ్బంది
నిరుద్యోగులకు ఉపాధి అందనిపండే అవుతోంది. ఏదో అదృష్టం కొద్దీ కాంట్రాక్టు ఉద్యోగమైనా దొరికిందనుకుంటే జీతభత్యాల్లేని వెట్టి చాకిరీ కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. వైద్యశాఖలో 14 పోస్టులను తొమ్మిది నెలల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారు. అయితే వారికి ఏడు నెలలుగా జీతాల్లేవు. వారికి జీతాలెవరు ఇచ్చేదీ తేలకుండానే వారి గడువు మరో రెండు నెలల్లో ముగుస్తుండడం విశేషం.
చింతూరు: అదిగో ఉద్యోగం.. వేలల్లో జీతం.. అంటూ కళ్లముందు రంగుల ప్రపంచాన్ని చూపుతూ గిరిజన నిరుద్యోగులను ఊహాల్లోకాల్లో విహరింపజేశారు. వాస్తవంలోకి వచ్చేసరికి ఆ రంగుల కల కరిగిపోయింది. తొమ్మిది నెలల కాంట్రాక్టు పద్ధతిపై వైద్యశాఖ విధుల్లో చేరిన వారికి ఏడు నెలలుగా జీతాలు రావడం లేదు. మరో రెండు నెలల్లో వారి గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచడం లేదు.
ఐటీడీఏ, వికాస ద్వారా భర్తీ
విలీన మండలాల్లోని నిరుద్యోగుల కోసం గతేడాది సెప్టెంబర్‌లో రంపచోడవరం ఐటీడీఏ, వికాస సంస్థ ద్వారా వైద్యశాఖలో 14 పోస్టులను భర్తీ చేశారు. చింతూరు, కూనవరం, ఏడుగురాళ్లపల్లి, నెల్లిపాక, గౌరిదేవిపేట పీహెచ్‌సీల్లో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, కుక్, స్వీపర్ పోస్టులకు వారిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ. 12 వేల జీతం ఇస్తామని తొమ్మిది నెలలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరిన ఈ 14 మందికి ఈ ఏడాది జూన్‌తో కాలపరిమితి ముగుస్తోంది.
ఏడు నెలలుగా జీతాల్లేవు
తాము విధుల్లో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్కనెల జీతం కూడా అందుకోలేదని, తమవి వెట్టిచాకిరి బతుకులే అయ్యాయని ఆ కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. తమకు జీతాలు చెల్లించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రంపచోడవరం, చింతూరు పీవోలు, ఆర్డీవో, డీఎం అండ్ హెచ్‌వో, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌వోలను కలసి మొరపెట్టుకున్నామని వారు తెలిపారు. ఏ అధికారి వద్దకు వెళ్లినా బడ్జెట్ లేదు, చూస్తాం, చేస్తాం అన్న మాటలే తప్ప ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు ఎవరివ్వాలనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. తమకు ఉద్యోగాలివ్వడమే పాపం అన్నట్టుగా అధికారుల చీత్కారాలతో విసిగి వేసారి పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొలువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. తమ ఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. గడువు ముగుస్తుండడంతో తిరిగి తమను కొనసాగిస్తారో లేదో కూడా అనుమానంగా ఉందని వారు వాపోయారు.
ఇళ్లలో ఒత్తిడి అధికమవుతోంది
ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు. దాంతో ఇళ్లలో సైతం మాపై ఒత్తిడి అధికమవుతోంది. కుటుంబపోషణ కోసం కొలువుల్లో చేరితే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం.
-మోసం రాములమ్మ, స్వీపర్, శబరికొత్తగూడెం, కూనవరం మండలం
మానేయడమే శరణ్యం
ఇతర మండలాల నుండి వచ్చి గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నాం. జీతాలు ఇవ్వకపోతే విధులు ఎలా నిర్వహించాలి? అందుకే అందరం కలసి మూకుమ్మడిగా మానేయాలని ఆలోచిస్తున్నాం.
-ఆసు దుర్గాప్రసాద్, ఎఫ్‌ఎన్‌వో, రేపాక, కూనవరం మండలం
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
14 మందికి జీతాలు రానిమాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. జీతాలకు సంబంధించిన ఫైల్ పంపమన్నారు. కానీ ఆ ఫైల్ మావద్ద లేదు.
-డాక్టర్ శేషిరెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ, చింతూరు
Advertisement
Advertisement