రూ.100కోట్లపై సందిగ్ధం
రాష్ట్ర ప్రభుత్వం 2016–17 బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులపై ఇంకా సందిగ్ధం వీడడంలేదు.
► పబ్లిక్ హెల్త్‌కా..? కార్పొరేషన్ కా ..?
► మూడునెళ్లయినా తేల్చని ప్రభుత్వం
► అయోమయంలో పాలకవర్గాలు
కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం 2016–17 బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులపై ఇంకా సందిగ్ధం వీడడంలేదు. గతేడాది బడ్జెట్ నిధులకు సంబంధించి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించారు. వాటికి ఆమోదం తెలుపుతూ మూడు నెలల క్రితం కార్పొరేషన్లకు ఇచ్చే రూ.100 కోట్ల నిధులను పబ్లిక్ హెల్త్ విభాగానికి ఇస్తూ సర్కారు జీవో విడుదల చేసింది. అయినా పబ్లిక్‌హెల్త్ ఈఎస్‌సీకి ఎలాంటి ఉత్తర్వులు అందించకుండానే సస్పెసన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులను పబ్లిక్‌హెల్త్ ద్వారా ఖర్చుపెట్టడం పట్ల కార్పొరేషన్లు పాలకవర్గాలు అంసతృప్తి వ్యక్తం చేశాయి.
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పాలకవర్గాలు కార్పొరేషన్ యంత్రాంగం ద్వారానే నిధులు ఖర్చుపెట్టాలని కౌన్సిల్ సమావేశాల్లో తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపించాయి. రాష్ట్ర మంత్రులతో జరిగే ఇతర సమావేశాల్లోనూ ఈ నిధుల వినియోగంపై వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మున్సిపల్ ద్వారానే నిధులు ఖర్చుపెట్టేలా చూస్తామని ప్రభుత్వం మాట ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటనగానీ, ఎలాంటి కార్యాచరణగానీ చేపట్టకపోవడంతో అధికారులు, పాలకవర్గసభ్యులు అయోమయానికి గురవుతున్నారు.
పబ్లిక్ హెల్త్‌లో సిబ్బంది కరువు
పబ్లిక్ హెల్త్ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు మిషన్‌భగీరథ పనులతోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చుపెట్టాలంటే రూ.100 కోట్లకు టెండర్లు పిలవడం, అగ్రిమెంట్లు, నాణ్యత పరిశీలన తదితర పనులు తక్కువ సిబ్బందితో చేయడం అంత సులువైన పనికాదు. నిధులు ఖర్చు కత్తిసాముగానే మారనుంది. అదే కార్పొరేషన్‌లలో అయితే పదుల సంఖ్య లో ఇంజినీర్లు, వర్క్ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఒత్తిడి ఉన్న పనులు కూడా పెద్దగా ఏమీలేవు. టెండర్ల నిర్వహణ, పనుల పరిశీలన చేయడం ఇబ్బందేమీ కాదు. ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తిచేసుకున్న కార్పొరేషన్ల అధికారులు నిధులు మున్సిపాలిటీలకు ఇస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
అయోమయంలో పాలకవర్గాలు
కార్పొరేషన్లకు ఇచ్చే నిధులను మున్సిపల్ విభాగం నుంచి కాకుండా పబ్లిక్‌హెల్త్ నుంచి పనులు చేపట్టాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం కార్పొరేటర్లను అయోమయానికి గురిచేసింది. మున్సిపల్ విభాగం ద్వారా ఖర్చు పెడితే తమకు బాధ్యత ఉంటుందని, తమ డివిజన్లలో నాణ్యతతో పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అదే పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా పనిచేస్తే తమకేమీ సంబంధం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కార్పొరేషన్ల ద్వారానే ఖర్చుపెట్టే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నిధులపై అంశంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.