ఆరంభంలోనే అవినీతి పర్వం
ఆరంభంలోనే అవినీతి పర్వం
Published Thu, May 4 2017 11:51 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
- నిబంధనలు హుష్‌కాకీ ... ఇష్టారాజ్యంగా పనులు
- రూ.80 లక్షలు కాలువలపాలు
- నివ్వెరపోతున్న ఆయకట్టుదారులు
అమలాపురం : డెల్టా ఆధునికికీరణ పనుల ఆరంభంలోనే అవినీతి పర్వానికి తెరలేచింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువ తవ్వకాలు చేపట్టి నాలుగు రాళ్లు జేబులో వేసుకునేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తుంటే అందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు కాక.. మరమ్మతులు జరగక అధ్వానంగా మారిన అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80 లక్షలతో కాలువలో పూడికతీత, రిటైనింగ్‌వాల్, మూడు స్లూయిజ్‌ల నిర్మాణాలు ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. కాలువలు మూసివేసిన సుమారు పదిహేను రోజుల తరువాత గత నెల 30 నుంచి పనులు ఆరంభించారు. పనులు ఆరంభించిన తొలిరోజు నుంచే ఇక్కడ అవినీతి అంకానికి తెరలేచింది. కాలువల్లో పూడిక తొలగించేముందు నిబంధనల ప్రకారం నీరు ఉండకూడదు. తీసిన మట్టిని కెనాల్ బ్యాంక్ (కాలువగట్టు )మీద వేసి గట్టును 1:1.5 స్లోపుతో పటిష్టం చేయాల్సి ఉంది. కానీ కాలువలో అడుగున అడుగున్నర లోతున నీరు ఉండగానే ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. వచ్చిన బురద, నీరుతో కలిసిన మట్టిని గట్ల మీద వేసి చేతులు దులుపుకుంటున్నారు. నీరు ఉండడం వల్ల నిబంధనల మేరకు లోతున కాలువ తవ్వుతున్నారా? లేదా? అనేది తేలియకుండా పోతోంది. పైగా బురద మట్టి వేయడం వల్ల కాలువ గట్టు పటిష్ఠంగా ఉండడం అటుంచి వచ్చే వర్షాకాలం మట్టి కాలువలోకి కొట్టుకుపోయి పూడుకుపోనుంది. ఇలా చేయకూడదని తెలిసి కూడా కాంట్రాక్టరు మూడు నాలుగు ప్రొక్లెయినర్లు పెట్టి యధేచ్ఛగా పనులు చేసుకుంటూపోతున్న తీరును చూసి రైతులు నివ్వెరపోతున్నారు.
రోడ్డు విస్తర్ణ ఉందని తెలిసి కూడా...
అమలాపురం ఎర్రవంతెన– నల్లవంతెనల మధ్య ఓఎన్జీసీ చేపట్టిన బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలోనే ఆదరాబాదరగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. పూడిక తీసిన మట్టిన ఎన్టీఆర్ మార్గ్ వైపు వేసేందుకు వీలులేకుండా ఉండడంతో ఓఎన్జీసీ విస్తరించనున్న రోడ్డు వైపు గుట్టు మీద వేసి పట్టిష్టం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఈ గట్టును తెంచివేయనున్నారు. కాలువల్లో ప్రొక్లెయిన్లు తిరిగే అవకాశమున్నందున పూడిక తొలగింపు చేపట్టడం వల్ల ప్రయోజనంలేకుండా పోతోంది. పనులు చేశామని బిల్లులు నొక్కేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే పనులు చేస్తున్నామని ఇరిగేషన్ ఏఈ ఎస్.శివరామకృష్ణ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కాలువల్లో నీరు మళ్లించేందుకు బాటలు ఏర్పాటు చేసే పనులు చేస్తున్నామని, తరువాత పక్కాగా పనులు చేస్తామని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement