ఆకలిదప్పులు.. ‘ముంపు’ తిప్పలు
- మూడు రోజులుగా ముంపులోనే..
- వరద తగ్గుముఖం పట్టినా తీరని కష్టాలు
- పాశర్లపూడిలో ఒకరి మృతి
- అప్పనపల్లి కాజ్‌వే వద్ద దేవస్థాన ఉద్యోగి గల్లంతు
- బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
- జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు
అమలాపురం : కనురెప్పల మాటున ఉప్పెనగా వచ్చి పడిన గోదావరి వరద లంకవాసులను ఇక్కట్ల పాల్జేస్తోంది. వరద తగ్గుతున్న కొద్దీ లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. మూడు రోజులుగా ముంపు బారిన పడడంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఏ లంక గ్రామం చూసి నా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు గోదావరి శాంతిస్తున్నా.. లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. వరదల వల్ల కోనసీమలో మురుగునీటి కాలువలు పొంగిపొర్లుతుండడంతో.. ఇక్కడ ముంపు తీవ్రత పెరుగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.70 అడుగులు నమోదు కాగా, బ్యారేజ్ నుంచి 14.15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి వేగంగా తగ్గడంతో బ్యారేజ్ వద్ద రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముంది. భద్రాచలం వద్ద వరద వేగంగా తగ్గుతున్నందున గురువారం ఉదయానికి తొలి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని 75 లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బ్యారేజ్ ఎగువ ప్రాం తంలో ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని లంకలతో పాటు రాజమండ్రి బ్రిడ్జి లంక, కేతావారి లంకల్లో ముంపు వీడుతోంది. అయినప్పుటికీ బాధితులు ఇంకా రాజమండ్రిలోనే తల దాచుకొంటున్నారు. బ్యారేజ్ దిగువన ఉన్న లం కల్లో మధ్యాహ్నం వరకు వరద ఉధృతి కని పించింది. మధ్యాహ్నం నుంచి ముంపు వీడుతోం ది. కోనసీమ లంకల్లో రెండు, మూడు అడుగుల మేర ముంపు తగ్గింది. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు, అల్లవరం మం డలాల్లో లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపు కొద్దికొద్దిగా తగ్గుతున్నా.. ఇంకా ఇళ్లు, రోడ్లు, పొలాలు నీట మునిగే ఉన్నాయి. గురువారానికి కానీ లోతట్టు ప్రాంతాల్లోని లంకల్లో ముంపువీడే పరిస్థితి కనిపించడం లేదు.
ఒకరి మృతి, మరొకరి గల్లంతు
మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన బూల వెర్రియ్య(60) ఇంటి నుంచి బయటకొ స్తూ.. బుధవారం ముంపులో ఉన్న గోతిలో పడి చనిపోయాడు. ఇంటి చుట్టూ వరదనీరు చేరడం తో గొయ్యిని అతడు గుర్తించకపోవడంతో ఈ సం ఘటన జరిగింది. మామిడికుదురుకు చెందిన కాం డ్రేగుల శ్రీనివాస శాస్త్రి (50) అప్పనపల్లి కాజ్‌వే వద్ద వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. విధులు ముగించుకుని వెళుతున్న అతడు పడవ అం దుబాటులో లేకపోవడంతో.. కాజ్‌వే మీదుగా నీటి లో దిగివెళుతూ కొట్టుకుపోయాడు. అలాగే మంగళవారం గల్లంతైన పి.గన్నవరం మండలం కె.ముం జవరానికి చెందిన చింతా కృష్ణమూర్తి ఆచూకీ లభ్యం కాలేదు. అతడి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పరామర్శించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్.. బుధవారం కూడా కోనసీమలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
క‘న్నీటి’ కాపురాలు
మూడు రోజులుగా ముంపులో చిక్కుకోవడంతో గోదావరివాసులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ముంపు మధ్యే లంకవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. చుట్టూ నీరు ముంచెత్తడంతో.. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ముంపులో మునిగిన అనేక పూరిళ్లు కూలిపోయాయి. ముంపు బారి నుంచి ప్రాణాలతో ఒడ్డున పడ్డవారు ఏటిగట్లపై కొబ్బరి తడికెల మాటున కాలం వెళ్లదీస్తున్నారు. అనేక మంది తమ ఆస్తులకు రక్షణగా ఇళ్ల వద్దనే ఉండిపోయారు. పునరావాస కేంద్రాల్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు.
ఎప్పుడు తమ ఇళ్లకు రెక్కలు కట్టుకుని వాలిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారుతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఉన్న వారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నిత్యావసర వస్తువులు నిండుకోవడం, బయటకు వెళ్లి తెచ్చుకొనే దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో పాటు వచ్చిపడుతున్న విష సర్పాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు మూతపడ్డాయి.
బడులు పోతాయన్న ఉద్దేశంతో చిన్నారులు పడవలపై పాఠశాలలకు వెళుతున్నారు. నిన్నటి వరకు వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాటి మీదుగా పడవలతో రాకపోకలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఒకవైపు పంట దెబ్బతింటుందన్న ఆందోళన, మరోవైపు మార్కెట్‌కు కూరగాయలు, పండ్లు పడవలపై తరలించేందుకు నానా ఇక్కట్లకు గురవుతున్నారు.
డెల్టాలో పెరుగుతున్న ముంపు
డెల్టాలో డ్రెయినేజీలను ఆనుకుని ఉన్న గ్రామాలు సైతం ముంపులో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్‌ఫాల్ స్లూయిజ్ ధ్వంసం కావడంతో అయినాపురం, ముమ్మిడివ రం, సోమిదేవరపాలెంల్లో 1500 ఎకరాల్లోని వరి చేలు ముంపుబారిన పడ్డాయి. అమలాపురం మం డలం బండార్లంక అప్పర్ కౌశిక గట్టుపై నుంచి ముంపు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోరింకల అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్లు సకాలంలో మూయక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.