పుష్కర ఘాట్లలో అవినీతి ధార
-
మొక్కుబడిగా పనులు
-
అడుగడుగునా నాసిరకం
-
నిరుపయోగంగా 32 ఘాట్లు
-
అమరావతిలో అసంపూర్తిగా వదిలివేసిన ఘాట్ నిర్మాణం
సాక్షి, అమరావతి : పవిత్రమైన పుష్కర పనుల్లోనూ అవినీతి రాజ్యమేలింది. కోట్లాది రూపాయల సొమ్ము కష్ణమ్మ ఒడిలో కలిసిపోయింది. ఎలాగోలా పూర్తయితే చాలనే తీరే నిర్మాణాల్లో కనిపించింది. పుష్కరాలు పూర్తయినా ఆ పేరుతో చేసిన అవినీతి జాడలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల పూర్తయిన పుష్కరాల కోసం గుంటూరు జిల్లాలో 80 ఘాట్లను నిర్మించారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. హడావిడిగా, నాసిరకంగా చేయడంతో పుష్కరాలు పూర్తికాకముందే అనేక ఘాట్ల వద్ద టైల్స్ లేచిపోయాయి. శాశ్వతంగా ఉండేలా నిర్మాణాలు చేస్తున్నామని, విజిలెన్స్, ప్రత్యేక బందాల ద్వారా పనులను తనిఖీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చేసిన హడావిడి మాటలకే పరిమితమైంది.
వ్యూహాత్మక జాప్యమే...
పుష్కర పనులు ఆలస్యంగా మంజూరు చేయడం వ్యూహాత్మకంగానే జరిగింది. అధికారులు సైతం ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం. జిల్లాలోనే ప్రధాన ఘాట్ అయిన అమరావతిలోనూ నిర్మాణ పనులు అడుగడుగునా నాసిరకంగానే జరిగాయి. కాంక్రీట్ పనులు పూర్తిగా నాసిరకంగా చేపట్టారు. చివరికి టైల్స్ సైతం అనేక చోట్ల సిమెంటు లేకుండా ఇసుకలోనే అతికించారు. పుష్కరాల ప్రారంభం రోజు వరకు పనులు కొనసాగించటం గమనార్హం. ఆ తర్వాత పైపై మెరుగులు మాత్రం అద్దారు. దీంతో పుష్కరాల ప్రారంభానికే టైల్స్ లేచిపోయిన పరిస్థితి కనిపించింది. హడావుడిగా, ఎగుడుదిగుడుగా టైల్స్ వేయటంతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ధరణికోట, అమరలింగేశ్వరుని ఘాట్ కలపకుండానే గుడి వెనుక భాగంలో కాంట్రాక్టర్ వదిలేశాడు. సీతానగరం ఘాట్‌లోను సిమెంటు పనులు నాసిరకంగానే జరిగాయి. 13 రోజులకే పనుల్లో డొల్లతనం బయటపడుతోంది.
ఆ ఘాట్ల నిర్మాణం.. కొల్లగొట్టేందుకే..
జిల్లాలో గురజాల, రేపల్లె, మంగళగిరి, పెదకూరపాడు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి, అవసరం లేకున్నా కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు ఘాట్ల నిర్మాణాలు చేపట్టారు. దీనికి అనుబంధంగా లింక్ రోడ్లు వేసి కోట్ల రూపాయలను కొల్లగట్టారు. జిల్లాలో బ్యారేజీ దిగువన కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు మండలాల పరిధిలో నిర్మించిన 32 ఘాట్లకు నీరు లేక భక్తులు స్నానాలు చేయలేదు. నదిలో ఇసుక గోతులు ఉన్నాయని, ప్రమాదమని తెలిసినా దేశాలమ్మ ఘాట్, మోతర్లలంక, జువ్వలపాలెం ఘాట్‌లను నిర్మించారు. పుష్కరాల సమయానికి ప్రమాదం పేరుతో వాటిలో స్నానాలు చేయకుండా నిలిపివేశారు. గుండెమడ, పాటూరు వంటి ఘాట్లలో ఒక్కరు కూడా స్నానం చేయలేదు. ఇలా అవసరం లేకున్నా ఘాట్ల నిర్మాణం పేరుతో పనులు చేసి తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. మరోపక్క అనేక ప్రాంతాల్లో ప్రజల సొమ్ముతో చేపట్టిన నిర్మాణాలకు పసుపు రంగు వేసి పూర్తిగా రాజకీయం ప్రదర్శించారు అధికార పార్టీ నేతలు.
సీఎం కుటుంబ సభ్యుల కోసమే..
ఉండవల్లి సమీపంలో వీఐపీ ఘాట్‌ను నిర్మించినా పుష్కరాల్లో అందులోకి ఎవరినీ అనుమతించలేదు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్నానాలు చేసేందుకు వీలుగా దాదాపు కోటి రూపాయలతో ఈ ఘాట్ నిర్మాణం చేపట్టడం గమనార్హం.