డీసీఎంఎస్‌లో అక్రమాలపై చర్యలు
► రూ.6.48 కోట్లు దుర్వినియోగం
► ఈ–రేడియేషన్, విత్తన విక్రయాల్లో అవినీతి
► మాజీ చైర్మన్‌తో పాటు ముగ్గురు ఉద్యోగుల ప్రమేయం
► ప్రస్తుతం పనిచేస్తున్న ఓ అధికారి సస్పెన్షన్
► ఉద్యోగ విరమణలో ఉన్న ఇద్దరు అధికారులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లో జరిగిన అవినీతి అక్రమాలపై పాలక మండలి ఉక్కుపాదం మోపింది. డీసీఎంఎస్‌లో 2006–07 నుంచి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిధులు పక్కదారి పట్టాయంటూ పి.శ్రీనివాస్‌రెడ్డి 2013లో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ–రేడియేషన్ ప్లాంట్‌లో అవినీతి జరిగిందని, విత్తన విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, రూ. 7 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలను లోకాయుక్తకు సమర్పించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో లోకాయుక్త డీసీఎంఎస్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని జిల్లా సహకార శాఖను ఆదేశించింది.
దీంతో అసిస్టెంట్ రిజిస్టార్ ఎన్.వెంకటేశ్వర్లును విచారణ అధికారిగా నియమించారు. నెల రోజుల పాటు 2006–07 సంవత్సరం నుంచి ఆదేశించిన కాలం నాటికి డీసీఎంఎస్‌లో అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపారు. రికార్డులను పరిశీలించారు. 2006–07 ఆర్థిక సంవత్సరంలో డీసీఎంఎస్ రూ. 14 కోట్లతో ఈ–రేడియేషన్ ప్లాంట్‌ను ఖమ్మంలోని వెంకటగిరి గేటు వద్ద ఉన్న స్థలంలో నిర్మించాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి పనులు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. మిషనరీ కొనుగోలుకు కోటి రూపాయలు కేటాయించారు. డీసీఎంఎస్‌కు ఉన్న ఆస్తుల ఆధారంగా ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 1.55 కోట్లు అప్పుగా తీసుకుంది.
ఈ బ్యాంక్ అప్పు వడ్డీతో కలుపుకొని రూ. 3.15 కోట్లకు చేరింది. ఈ అప్పులో రూ. 2 కోట్లు డీసీఎంఎస్ చెల్లించింది. అయినా అప్పు ఉండటంతో సంస్థకు మధిర, ఖమ్మంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంక్ సిద్ధమైంది. ఈ క్రమంలో అప్పులను చెల్లిస్తామని ప్రస్తుత మండలి వివరణ ఇస్తూ గిడ్డంగుల సంస్థ నుంచి సహకారం తీసుకొని అప్పులు చెల్లించింది.ఈ చెల్లింపులతో శాంతించిన బ్యాంక్ జప్తులను నిలిపివేసింది. ఏపీ సీడ్స్ ద్వారా వచ్చిన రూ. 3.84 కోట్ల విత్తనాల వ్యవహారంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది.
విత్తన విక్రయాలకు సంబంధించి సరైన రికార్డులు లేవు. మొత్తంగా 2006–07 నుంచి 2012–13 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ. 6.48 కోట్లకు సంబంధించి సరైన రికార్డులు, లెక్కలు లేవని విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి చైర్మన్ రామచంద్రమూర్తి, మేనేజర్లు సీతారామయ్య, రాఘవరాజు, ప్రస్తుత అసిస్టెంట్ మేనేజర్ సాయిబాబాలు బాధ్యులుగా గుర్తించారు.
అప్పటి పాలకవర్గం పదవీకాలం పూర్తి కాగా, మేనేజర్లుగా పనిచేసిన సీతారామయ్య, రాఘవరాజులు ఉద్యోగ విరమణ పొందారు. సాయిబాబా మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా సహకార శాఖ నిధుల అవినీతి, అక్రమాలపై సమగ్ర నివేదికను రూపొందించి ప్రస్తుత పాలకమండలికి పంపుతూ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నివేదకలో పేర్కొంది. సహకార చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని నివేదించటంతో డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య అధ్యక్షతన ఈ నెల 3వ తేదీన పాలక మండలి సమావేశమై సహకార శాఖ నివేదికపై చర్చించింది.
డీసీంఎస్ సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సహకార చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించిన వారికి నోటీసులు అందించటంతో పాటు, రికవరీకి చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇక ఇక్కడే విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మేనేజర్ సాయిబాబాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ చైర్మన్ రామచంద్రమూర్తి, ఉద్యోగ విరమణ పొందిన మేనేజర్లు తమకున్న ఆధారా>ల ఆధారంగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.