ఉల్లిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కడప కార్పొరేషన్: జిల్లాలో ఉల్లి పంట సాగుచేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. సోమవారం గ్రీవెన్స్‌లో ఆయన జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టి రైతులు ఉల్లిపంటను సాగుచేసుకున్నారని, అదృష్టవశాత్తు పంట దిగుబడి కూడా బాగా వచ్చిందన్నారు. అయితే మార్కెట్లో క్వింటాలుకు కేవలం రూ.300–400 మాత్రమే అమ్ముడుపోతుండటంతో రైతులు పెట్టుబడులు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలమైనందున వాటిని నిల్వ ఉంచడం రైతులకు కష్టసాధ్యంగా మారిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు సాగుచేసిన పంటను కొనుగోలు చేయాలని తద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉల్లిరైతులు కూడా ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతులు భాస్కర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు.