నరసరావుపేట టౌన్: గుంటూరు జిల్లాలో సెలైన్‌లోకి విషం ఎక్కించి భార్యను చంపిన భర్తకు జీవితఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. బొల్లాపల్లి మండలం కనుమలచెర్వు గ్రామానికి చెందిన రవికుమార్‌కు భార్య విమలమ్మపై అనుమానం ఉండేది. విమలమ్మ వినుకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో 2013 అక్టోబర్ 4వ తేదీన ఆడశిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తరువాత ఆస్పత్రికి వెళ్లిన భర్త ఎవరూ గమనించకుండా ఆమెకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్‌లో ఇంజెక్షన్ ద్వారా పురుగుమందు కలిపాడు.
కొద్దిసేపటి తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో గమనించిన వైద్యులు విషప్రయోగం జరిగిందని గుర్తించి విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం విమలమ్మను వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలు న్యాయమూర్తికి మరణవాగ్మూలాన్ని ఇచ్చి అదే నెల 6వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ పోలీసులు కేసునమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువుకావడంతో జీవిత ఖైదీ విధిస్తూ తీర్పుచెప్పారు.
సెలైన్‌లోకి విషం ఎక్కించిన భర్తకు....
Published Thu, Dec 3 2015 7:59 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement