హైదరాబాద్: రాజకీయ పెద్దలు, పోలీసుల సహకారంతో గ్యాంగ్‌స్టర్ నయీం చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సహకారంతోనే నయూమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు.
కరుడుగట్టిన ఈ నేరగాడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం అభినందనీయమన్నారు. కరీంనగర్ జిల్లాలోనూ నయీం సెటిల్‌మెంట్లు, దందాలు చేశాడని, నగునూర్‌లోనూ వందల ఎకరాల భూములను సంపాదించాడని తెలిపారు. వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, అతడికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లను బయటపెట్టాలని కోరారు.
2013 చట్టం అమలుతోనే న్యాయం
ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించే భూములకు 2013 చట్టం అమలు చేస్తేనే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చాడ అన్నారు. జీవో 123పై కోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వ విజయం కాదన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై తాము అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామన్నారు.
'నయీం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి'
Published Wed, Aug 10 2016 8:23 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement
Advertisement